నిబంధనలు తుంగలో… మద్యం దుకాణం ఇళ్ళ మధ్యలో…
– వెన్నెలగడ్డలో “మద్యం” మంటలు… అధికారుల నిర్ణయంపై ప్రజల ఆగ్రహం!
– నిబంధనలు తుంగలో తొక్కి వైన్ షాపుకి లైసెన్స్ ఇచ్చారా..?
– పాఠశాలలు, దేవాలయాల పక్కనే మద్యం దుకాణం… స్థానికుల తీవ్ర అభ్యంతరం
– ప్రజల ఫిర్యాదులను పట్టించుకోకుండా అనుమతులా..?
– బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు ఆపాలని డిమాండ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మార్చి 11: “చట్టాలు ప్రజల కోసమా… లేక కొందరి కోసమా?” అనే ప్రశ్న ఇప్పుడు వెన్నెలగడ్డ ప్రాంతంలో బలంగా వినిపిస్తోంది. నివాస ప్రాంతాల మధ్యలో, పాఠశాలలు, దేవాలయాలకు అతి సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి అధికారులు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతో స్థానికులు ఆగ్రహంతో రగులుతున్నారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని పక్కనబెట్టి అనుమతులు మంజూరు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వెన్నెలగడ్డలో ప్రతిపాదిత బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుపై ఇప్పుడు తీవ్ర వివాదం నెలకొంది. ఈ ప్రాంతం పూర్తిగా నివాస ప్రాంతం కావడంతో పాటు సమీపంలో పాఠశాలలు, దేవాలయాలు ఉండటం వల్ల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన చేయకుండానే అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
√ అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు..
ఈ వ్యవహారంపై వెన్నెలగడ్డ నివాసితులు ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు పలు సంబంధిత శాఖల అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రతిపాదిత మద్యం దుకాణం అనేక చట్టపరమైన నిబంధనలను అతిక్రమిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థానికుల వివరాల ప్రకారం…ఒక ప్రైవేట్ పాఠశాల ఈ స్థలానికి 100 మీటర్ల లోపే ఉంది. మరో ప్రభుత్వ పాఠశాల 150 మీటర్ల దూరంలో ఉంది. అలాగే 100 మీటర్ల పరిధిలోనే ఒక దేవాలయం కూడా ఉంది. ఇలాంటి ప్రదేశంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే విద్యార్థులపై, భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
√ నిబంధనలు ఏమంటున్నాయి?
సాధారణంగా మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరుకు ముందు ఎక్సైజ్ శాఖ పలు కఠిన నిబంధనలను పాటించాలి. విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రుల నుండి నిర్దిష్ట దూరం (సాధారణంగా 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ) ఉండాలి.
అదే విధంగా: ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ స్వయంగా స్థలాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. పాఠశాల లేదా దేవాలయ ప్రవేశద్వారం నుంచి దుకాణం వరకు దూరాన్ని కొలవాలి. స్థానిక పోలీస్ స్టేషన్ (ఎస్ హెచ్ వో), మున్సిపల్ అధికారుల అభిప్రాయం తీసుకోవాలి. ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రభావం ఉంటుందా..?అనే అంశాన్ని పరిశీలించాలి. ఈ ప్రక్రియలను పక్కనబెట్టి అనుమతులు మంజూరు చేసినట్లయితే అది చట్ట విరుద్ధమే అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
√ ఎన్ఓసీ నిజంగానే ఉందా..?
స్థానికులు సామూహికంగా అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో జిల్లా కలెక్టర్ లేదా ఎక్సైజ్ కమిషనర్‌కు ఆ అనుమతులను నిలిపివేసే అధికారముంది. అయితే “నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (నిరభ్యంతర పత్రం) నిజంగానే ఉందా? లేక తప్పుడు నివేదికలతో అనుమతులు ఇచ్చారా?” అనే ప్రశ్నలు ఇప్పుడు వెన్నెలగడ్డలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
అధికారులు వాస్తవాలను కప్పిపుచ్చి నివేదికలు ఇచ్చి ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలతో సంయుక్త తనిఖీ నిర్వహించి, బార్ అండ్ రెస్టారెంట్‌కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
√ అధికారులు స్పందించేనా..?
ప్రజల ఆవేదనను అధికారులు పరిగణలోకి తీసుకుని అనుమతుల ప్రక్రియను నిలిపివేస్తారా? లేక నిబంధనలను పక్కనబెట్టి ముందుకు సాగుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెన్నెలగడ్డలో మొదలైన ఈ మద్యం వివాదం చివరకు ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.