తనిఖీలు కాదు వేధింపులే… డ్రగ్ కంట్రోల్ అధికారుల ‘సెటిల్మెంట్’ డ్రామా!

– ప్రైవేట్ వ్యక్తి కోసం అధికారుల అత్యుత్సాహం?
– షాప్‌లో వాటా ఇవ్వకపోతే తనిఖీలతో టార్చర్
– నాలుగు నెలల్లో నాలుగు సార్లు తనిఖీలు
– ఇప్పటికే ఒకసారి సీజ్… మళ్లీ బెదిరింపులు
– మీడియా రాగానే అక్కడి నుంచి జారుకున్న అధికారులు
– కూన రాజకుమార్ గౌడ్ వేధిస్తున్నాడంటూ మహిళా బాధితురాలు ఆవేదన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మార్చి 10:
చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే ఒక ప్రైవేట్ వ్యక్తికి వత్తాసుగా నిలబడి వ్యాపారులను వేధిస్తే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తనిఖీల పేరుతో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఒక మెడికల్ షాప్ యజమానిని పదేపదే టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుల తెలిపిన వివరాలు, అందించిన ఆధారాలు ప్రకారం…
✓ వాటా ఇవ్వకపోతే వేధింపులు…
జీడిమెట్ల గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి ‘నోబుల్ పెట్ అండ్ వెటర్నరీ మెడికల్ హాల్’ పేరుతో పశువుల మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. వ్యాపారం సజావుగా సాగుతున్న సమయంలో స్థానికంగా నివసించే కూన రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆ షాప్‌పై కన్నేశాడు. తనకు రాజకీయ పలుకుబడి ఉందని, మంత్రికి సన్నిహితుడినని చెప్పుకుంటూ షాప్‌లో వాటా ఇవ్వాలని లేకపోతే నెలనెలా మామూళ్లు ఇవ్వాలని భాగ్యలక్ష్మి కుటుంబంపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
✓ అధికారులను అడ్డం పెట్టుకుని టార్చర్…
వాటా ఇవ్వడానికి నిరాకరించడంతో రాజ్‌కుమార్ తన పరిచయాలను ఉపయోగించి డ్రగ్ కంట్రోల్ అధికారులను రంగంలోకి దింపాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి తనిఖీల పేరుతో షాప్‌ను పదేపదే టార్గెట్ చేయడం ప్రారంభమైంది. ఒకసారి ఏకంగా షాప్‌ను సీజ్ చేయడం, మరోసారి తనిఖీల పేరిట బెదిరింపులకు దిగడం జరిగింది.
✓ పోలీసులకు ఫిర్యాదు… అయినా మారని తీరూ
ఈ వేధింపులపై బాధితురాలు భాగ్యలక్ష్మి గతంలోనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజ్‌కుమార్‌ను పిలిపించి మందలించినప్పటికీ అతని తీరులో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పైగా బాధితులపైనే తిరిగి పరువు నష్టం దావా నోటీసులు పంపిస్తూ ఒత్తిడి పెంచినట్లు సమాచారం.

షాప్ లో తనిఖీలు చేస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు

✓ మంగళవారం మళ్లీ తనిఖీలు… మీడియా రాగానే వెనక్కి
తాజాగా మంగళవారం రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కుత్బుల్లాపూర్ డ్రగ్ కంట్రోల్ అధికారి తిరుపతి, మల్కాజిగిరి డ్రగ్ కంట్రోల్ అధికారి మురళీకృష్ణలు షాప్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో అధికారులు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
✓ బాధితురాలి ఆవేదన…
తనిఖీల పేరుతో జరుగుతున్న ఈ వేధింపులపై విసిగిపోయిన భాగ్యలక్ష్మి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఒత్తిడితో అధికారులు ఇలా వ్యవహరించడం వల్ల నిజాయితీగా వ్యాపారం చేసుకునే వారిపై అన్యాయం జరుగుతోందని ఆమె వాపోయారు.
✓ విచారణకు డిమాండ్…
ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ అధికారులు పని చేయడం అత్యంత దురదృష్టకరమని స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసి ‘సెటిల్మెంట్లు’ చేయాలని సూచించడం అధికారుల విధి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార ముసుగులో జరుగుతున్న ఈ వేధింపులపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా…? లేక మళ్లీ మౌనంగా ఉంటుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఉన్నతాధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే..

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More