హైదరాబాద్: తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ గా వకుళాభరణం కృష్ణ మోహన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బిసి కమిషన్ లో కృష్ణ మోహన్ సభ్యులుగా ఉన్నారు.
కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, కిశోర్ గౌడ్, శుభప్రద పాటిల్ ను నియమించారు. బిసిల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిషన్ ను గతంలో నియమించారు. బిసి ల నుంచి ఎంబిసిలను వేరు చేసేందుకు కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అధ్యయనం చేసింది. నివేదికను ముఖ్యమంత్రి కెసిఆర్ కు సమర్పించింది. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో కమిషన్ కు సభ్యులు, ఛైర్మన్ ని నియమించారు. కృష్ణ మోహన్ హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందినవారు. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి 2016 అక్టోబర్ నెలలో బిఎస్.రాములు ను ఛైర్మన్ గా నియమించారు. 2019 లో కమిషన్ పదవీకాలం ముగిసినా భర్తీ చేయకపోవడం తో హైకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసింది. భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని గత నెలలో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కూడా.