తెలంగాణలో రేపే ‘నీట్’.. ఇలా చేస్తే మూడేళ్ల డిబార్!
వైద్య విద్యలో (UG)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయం గతంలో మూడు గంటలు ఉండగా ఈసారి మరో 20 నిమిషాలు పెంచి 3.20 గంటలు చేశారు. మొత్తంగా 200 ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు 200 నిమిషాల సమయాన్ని కేటాయించారు. వీటిలో 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచడంపై విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 25 పట్టణాల్లో 115 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాయొచ్చు. తెలంగాణలో దాదాపు 60 వేలమంది విద్యార్థులు ‘నీట్’కు హాజరుకానున్నారు. పరీక్ష 2 గంటలకు ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు 1.30 గంటకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి అనుమతి ఉండదు.
విద్యార్థులు ఇవి పాటించాలి
విద్యార్థులు నిబంధనలు పాటించకున్నా, అక్రమాలకు పాల్పడినా మూడేళ్లపాటు డిబార్ చేస్తారు. జవాబు పత్రం నుంచి ఏ కారణంతోనూ పేజీలు చింపకూడదు. దరఖాస్తు ఫారం నింపేటప్పుడు అడ్మిట్ కార్డుపై అతికించే ఫొటోలో మార్పులు చేయకూడదు. విద్యార్థులు అడ్మిట్ కార్డ్, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. అలాగే, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, పాన్‌కార్డ్, ఆధార్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డు వంటివాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
మాస్క్ ధరించడం తప్పనిసరి. అభ్యర్థులు కనుక ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతుంటే డాక్టర్ చీటీని చూపించి మందులు తీసుకెళ్లొచ్చు. అలాగే, పారదర్శకంగా ఉండే నీళ్ల సీసాను కూడా తీసుకెళ్లొచ్చు. ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవిపోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, బ్యాడ్జ్‌లు, హెయిర్‌పిన్‌లు, హెయిర్ బ్యాండ్‌లు, తాయెత్తులు, గాగుల్స్, హ్యాండ్‌బ్యాగులను ధరించకూడదు. సాధారణ చెప్పులు మాత్రమే ధరించాలి. పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులకు బ్లూ/ బ్లాక్ పాయింట్ పెన్ను ఇస్తారు.
NEET, Exam, NTA, Telangana