దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. భారీగా విక్రయాలు!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) విప్లవం క్రమంగా ఊపందుకుంటోంది. ఇప్పటికే 13 లక్షల మందికి పైగా పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాలకు యజమానులయ్యారు. ఈ వివరాలను కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జులై 14 నాటికి దేశవ్యాప్తంగా 13,34,385 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్టు చెప్పారు. పైగా కేంద్ర మంత్రి చెప్పిన ఈవీ గణాంకాల్లోకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ రాష్ట్రాల గణాంకాలను తీసుకోలేదు. ఇవి వాహన్ 4 ప్రాజెక్టులో భాగంగా లేవని మంత్రి చెప్పారు. రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలు తెలిపారు.
మోటారు వాహనాల చట్టం ప్రకారం 25 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళ్లే వాహనాలకే రిజిస్ట్రేషన్ అవసరం. దీంతో 25 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో నడిచే ఈవీలు రిజిస్ట్రేషన్ గణాంకాల్లోకి రావు. వాటిని కూడా కలిపి చూస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ స్కూటర్లే ఎక్కువ.
మరికొన్ని ఆసక్తికర గణాంకాలను కూడా మంత్రి వెల్లడించారు. 207 దేశాల్లో 205,81,09,486 వాహనాలు రిజిస్టర్ అయి ఉండగా, ఇందులో 13.24 శాతం (27,25,87,170) భారత్ లో ఉన్నాయి. 2020లో భారత్ లో 1.5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 207 దేశాల్లో 2020లో జరిగిన మొత్తం ప్రమాదాల్లో మన దేశ ప్రమాదాలు 26.37 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 1,056 పురుషులు, 1,060 మహిళల టాయిలెట్లు ఉన్నాయి.
electric vehicles, salesrises, Nitin Gadkari, road accidents