తెలుగు రాష్ట్రాల మధ్య తొలి సెమీ హైస్పీడ్‌ రైలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందేభారత్‌ సంక్రాంతి పర్వదినాన ఆదివారం పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌ 10వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి పరుగులు పెట్టే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిల్లీ నుంచి 10.30కి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రైలు ఇప్పటికే సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఈనెల 16 నుంచి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తోంది. శనివారం రాత్రి కేంద్ర మంత్రులు అశ్వినీవైష్ణవ్‌, కిషన్‌రెడ్డి స్టేషన్‌కు చేరుకొని ఏర్పాట్లు పర్యవేక్షించారు. వందేభారత్‌ రైలెక్కి పరీక్షించారు. వీరివెంట దక్షిణమధ్యరైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం అభయ్‌కుమార్‌ గుప్తా, సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా భాజపా అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌ ఉన్నారు.

*అత్యధిక దూరం ప్రయాణం*

దేశంలో ఇప్పటివరకు ఏడు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (నం.20833/20834) ఎనిమిదో రైలు. దిల్లీ-కట్రా మధ్య నడిచే వందేభారత్‌ ఇప్పటివరకు అత్యధిక దూరం (655 కి.మీ.) ప్రయాణించే రైలు. తాజాగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం వందేభారత్‌ దేశంలో అత్యధిక దూరం నడిచే రైలు(698.5కి.మీ.) కానుంది.

*కొన్ని గంటల్లోనే నిండిపోయిన సీట్లు*

వందేభారత్‌ రైలు ప్రయాణికులకు సోమవారం నుంచి అందుబాటులోకి రానుండగా సీట్ల రిజర్వేషన్‌ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. సాయంత్రానికల్లా సోమ, మంగళ, బుధ, గురు వారాలకు వెయిటింగ్‌ లిస్ట్‌ వచ్చేసింది. ఆరంభంలో కొద్దిసేపు సర్వర్‌ మొరాయించింది. పండుగ రిజర్వేషన్లు ఇంతకుముందే చాలావరకు పూర్తయినా.. కొత్త రైలులో సీట్లు నిండిపోవడం విశేషం. సికింద్రాబాద్‌-విశాఖపట్నం అత్యంత రద్దీ మార్గం కావడంతో రానున్నరోజుల్లో సీట్ల బుకింగ్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లతో పోలిస్తే ఇందులో టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు ఇతర రైళ్లలో సీట్లు అయిపోయాకే ఈ రైల్లో టికెట్లకు ప్రాధాన్యమిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం వందేభారత్‌ రైళ్ల తీరుతెన్నులు పరిశీలిస్తే.. దిల్లీ-వారణాసి వందేభారత్‌ రైల్లో సగటున అయిదొందల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. బిలాస్‌పూర్‌-నాగ్‌పుర్‌ రైల్లో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పైచిలుకు సీట్లు ..దిల్లీ-అంబ్‌ అందౌరి రైల్లో 16న 483 సీట్లు, మిగతారోజుల్లో ఎనిమిది వందల చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా రద్దీ రూట్లలో మూడు, నాలుగు వారాల ముందే సీట్ల రిజర్వేషన్‌ అయిపోతుంది. వందేభారత్‌లో మాత్రం ప్రయాణానికి కొద్దిగంటల ముందే సీట్లు నిండుతున్నాయి. అది కూడా కొన్ని రూట్లలోనే. దిల్లీ-కట్రా, దిల్లీ-వారణాసి, చెన్నై-మైసూర్‌, న్యూజల్పాయ్‌గురి-హావ్‌డా వంటి రూట్లలో ప్రయాణానికి ఒక రోజు, కొద్దిగంటల ముందు వెయిటింగ్‌ లిస్టుకు వెళుతోంది. ముంబయి-అహ్మదాబాద్‌ వందేభారత్‌లో 18వ తేదీ వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది.

*ఆహారం వద్దనుకుంటే ఆ మేరకు వాపస్‌*

ఛైర్‌ కార్‌లో సికింద్రాబాద్‌-విశాఖట్నం మధ్య రూ.1,665 ఛార్జీ ఉంటే.. విశాఖపట్నం-సికింద్రాబాద్‌కు రూ.1,720గా ఉంది. ఆహారపదార్థాల ఛార్జీల్లో కొంత తేడా ఉండటమే ఇందుక్కారణం. క్యాటరింగ్‌ ఛార్జీలు.. విశాఖలో ఛైర్‌కార్‌లో రూ.364. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌లో రూ.419. సికింద్రాబాద్‌లో వరుసగా రూ.310, రూ.364. ఆహారం వద్దనుకుంటే టికెట్‌ఛార్జీలో ఆ మేర తగ్గుతుంది.

*ప్రయాణికులకు ఆప్షన్లు*

* కిటికీ సీటు ఎంచుకోవచ్చు. * ఏ కోచ్‌లో సీటు కావాలో కూడా బుకింగ్‌లో ఎంపిక చేసుకోవచ్చు. * ఆహారం కావాలా? వద్దా? కావాలంటే శాకాహారం, మాంసాహారం ఎంచుకోవచ్చు.

*28.5 శాతం సీట్లపై తత్కాల్‌ బాదుడు!*

* వందేభారత్‌లో మొత్తం సీట్లు : 1,128

* రెగ్యులర్‌ బుకింగ్‌లో : 806

* తత్కాల్‌ బుకింగ్‌లో : 322

28.5 శాతం సీట్లను రైల్వే శాఖ తత్కాల్‌ కోటాలో ఉంచింది. మొత్తం 16 బోగీలు. అందులో 14 ఏసీ ఛైర్‌కార్‌, 2 ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ బోగీలున్నాయి. మెట్రో రైలు తరహాలో స్లైడింగ్‌ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి సీసీటీవీ కెమెరాలు, రీడింగ్‌ లైట్లు, అత్యవసర పరిస్థితుల్లో రైలు సిబ్బందితో మాట్లాడేందుకు అలారం బటన్‌, ఎమర్జెన్సీ టాక్‌ బ్యాక్‌ యూనిట్‌ వంటి సౌకర్యాలున్నాయి. సీట్లు 180 డిగ్రీల కోణంలో తిరుగుతాయి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More