ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్‌ రైలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (Vande Bharat Express) పట్టాలెక్కింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘పండగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్‌ గొప్ప కానుక. తెలుగు ప్రజలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రైలు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుంది. హైదరాబాద్‌- వరంగల్‌ – విజయవాడ – విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్‌ – విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్‌తో బహుళ ప్రయోజనాలున్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్‌ రైలు ఇది. మారుతున్న దేశ భవిష్యత్తుకు ఇదొక ఉదాహరణ’’ అని మోదీ పేర్కొన్నారు.

ఇవాళ ఒక్కరోజు మాత్రం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రత్యేక వేళల్లో నడవనుంది. ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది (కేవలం 15వ తేదీన మాత్రమే ఈ స్టేషన్‌లలో ఆగుతుంది). రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. 16వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More