నిజాంపేట్ కార్పొరేషన్… కబ్జాలతో పరేషాన్…
~ అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అండదండలు,
~ అధికారుల సహకారంతో రెచ్చిపోతున్న కబ్జాకోరులు
~ చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలు మాయం
~ పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికార యంత్రాంగం
~ కలెక్టరేట్ ప్రజావాణిలో బిజెపి నాయకుల ఫిర్యాదు
నిజాంపేట (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 11: ఓ పక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, మరోపక్క కబ్జాదారులకు, ఇంకోపక్క ప్రభుత్వ అధికారులకు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమార్చనకు మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజుల్లుతుందని నిజాంపేట్ బిజెపి నాయకులు ఆరోపించారు. నిజాంపేట్ లో ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులతో పాటు వారికి సహకరిస్తున్న మున్సిపల్ కమిషనర్, మేయర్, సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కు బిజెపి నాయకులు ఫిర్యాదును సోమవారం అందజేశారు.
జీవో 59 ప్రకారం క్రమబద్ధీకరణకు యత్నం…
బిజెపి నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలో గత కొద్ది నెలలుగా సర్వేనెంబర్ 191/డి, 82, 83, 334, 87 (మార్కెట్ యార్డ్), 346, 191 (ఎన్టీఆర్ నగర్), 348, 186 (సాయి నగర్), 233/26,26, 290, 293, 319 ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేసి చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి విక్రయించడం, అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయన్నారు. విభజించిన ప్లాట్లను జీవో 59 ద్వారా క్రమబద్ధీకరణ చేయించడానికి అధికార పార్టీ నాయకుల అండదండలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసిన ప్లాట్లకు కోర్టు నుండి ఉత్తర్వులు పొందడంతోపాటు ఉద్యానవన, మార్కెట్ యార్డు స్థలాల్లో కబ్జాలు చేస్తున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు సహకరించడం వెనుక అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం తేటతెల్లమవుతుందన్నారు.
అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలి…
ప్రభుత్వ చెరువులు, కుంటలు, నాళాలను ఆక్రమించి అక్రమ అనుమతులతో నిర్మాణాలు చేపడుతున్న వాసవి, ఆకృతి కన్స్ట్రక్షన్స్, ఏపీ ఆర్, గ్రీన్ హోమ్స్ తో పాటు సర్వేనెంబర్ 331 కబ్జాలపై పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకొని హెచ్ఎండిఏ మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ప్రగతి నగర్ ఓపెన్ నాలాలో పడి చనిపోయిన మిథున్ రెడ్డి మృతికి కారణమైన కాంట్రాక్టర్ కు పనులు పూర్తి చేయకుండా బిల్లులు చెల్లించిన ఇంజనీరింగ్, కార్పొరేషన్ మేయర్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాటాలు తోనే యదేచ్చగా ఆక్రమణలు…
నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకొని ప్లాట్లుగా విభజించి షెడ్లను నిర్మించి వాటిని అమాయక ప్రజలకు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు విక్రయించి జేబులు నింపుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. అధికారులు విఫలమవ్వడమే కాకుండా అధికార పార్టీ నాయకులకు సదరు ప్లాట్లకు సంబంధించి వాటాలు ముట్ట చెప్పడంతోనే యదేచ్చగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. సర్వేనెంబర్ 233/25,26 స్థలంలో ఓ డ్రైవ్ ఇన్ హోటల్లో గతంలో అక్రమంగా నిర్మించడంతో దానిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు అనంతరం మున్సిపల్ అధికారులను ప్రసన్నం చేసుకోవడంతో అదే స్థలంలో హోటల్ పునర్నిర్మాణం జరగడంతో అధికారుల చిత్తశుద్ధి అవగతం అవుతుందన్నారు. అంతేకాకుండా ఒక కార్పొరేటర్ భర్త హోటళ్లు, షాపులు నిర్మించి అద్దెకిచ్చి జేబులు నింపుకుంటున్న అధికారులు మిన్నకున్నారని, కోమటికుంటలో వాసవి కన్స్ట్రక్షన్స్, ఏపీ ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆచార్య కుంటలో గ్రీన్ హోమ్స్, సర్వే నెంబర్ 331 లో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి నాలాలు ఆక్రమించుకొని, చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లలో అక్రమ అనుమతులతో నిర్మాణాలు చేపడుతున్న విషయంపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు
పనులు పూర్తవకుండా బిల్లులు ఎలా చెల్లిస్తారు…
ప్రగతి నగర్ ఓపెన్ నాలాలో ఇటీవల పడి చనిపోయిన మిథున్ రెడ్డి మృతికి కారణంగా చూపిస్తూ అపార్ట్మెంట్ వాచ్ మెన్, అధ్యక్షుడు పై కేసు నమోదు చేసిన పోలీసులు, రూ 99 లక్షలు నిధులను కేటాయించి, పనులు పూర్తికాకుండానే గుత్తేదారుకు బిల్లులు చెల్లించిన అధికారుల పై పూర్తి విచారణ జరిపి చర్యలు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఓపెన్ నాళాలు ఎందుకు ఉన్నాయో మున్సిపల్ అధికారులు మేయర్ స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకులు చెబుతున్నట్టు మోడల్ కార్పొరేషన్ గా కాకుండా కబ్జాల కార్పొరేషన్ గా దినదినాభివృద్ధి చెందుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సదరు చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాల కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకొని వాటిని ప్రజోపకరణ పనులకు వినియోగించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కార్పొరేషన్ బిజెపి ప్రధాన కార్యదర్శి గొల్ల కృష్ణ అధికార ప్రతినిధి కౌశిక్ నాయుడు కార్యదర్శి అరుణ్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కుంకి రాము ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కుమార్ గౌడ్ సీనియర్ నాయకుడు ఎల్ల స్వామి ఉన్నారు