ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించిన అడ్డా కార్మికులు
- ఎమ్మెల్యే, మంత్రికి వినతి పత్రాలు ఇచ్చిన పరిష్కారం శూన్యం
- కార్యరూపం దాల్చని నాలుగేళ్ల హామీ
పెట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 14: జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని షాపూర్ నగర్ అడ్డా కూలీలకు శాశ్వత అడ్డా స్థలాన్ని కేటాయించి, హమాలీ భవనం నిర్మించాలని ఏఐటియుసి, సిఐటియు నాయకులు ఉమా మహేష్, కీలకాని లక్ష్మణ్ ఆధ్వర్యంలో దండమూడి ఎన్క్లేవ్ లోని ఎమ్మెల్యే కేపీ వివేకానంద నివాసాన్ని అడ్డా కార్మికులు గురువారం ముట్టడించి ధర్నా చేశారు. గత 30 సంవత్సరాలుగా షాపూర్ నగర్ ప్రధాన రహదారి పక్కన అడ్డాను ఏర్పరచుకొని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని సుమారు 400 మంది కార్మికులు, హమాలీలు జీవనం సాగిస్తున్నారు. వారికి శాశ్వత అడ్డా లేకపోవడం తో పాటు కనీస సౌకర్యాలు అయిన మరుగుదొడ్లు స్థానాలు గదులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని వారు నినాదించారు. గత నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాలు అందజేసిన సమస్య పరిష్కారం కాలేదని వారు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయారని మండిపడ్డారు. వారు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా నెరవేరుస్తూ అడ్డా కూలీలకు స్థలాన్ని కేటాయించి హమాలీ భవనం నిర్మించాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నివాసం ముందు బైఠాయించి వారు నినాదాలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే బయటకు వచ్చి వినతిపత్రం తీసుకొని రానున్న వారంలోపు అడ్డాకులకు స్థలాన్ని కేటాయించేలా కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ ఆందోళనలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, సీఐటీయూ నాయకులు దేవదానం, ఏఐటీయూసీ,సీఐటీయూ నాయకులు రాము,శ్రీనివాస్, మల్లారెడ్డి కరుణాకర్ అంజన్న,ఆంజనేయులు,మల్లేష్, చంద్రమౌళి, నర్సింహారెడ్డి, మహేందర్, చంద్రకాంత్, నర్సిరెడ్డి,సత్తిరెడ్డి లతో పాటు సుమారు 200 మంది పాల్గొన్నారు.