రక్షణ లేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్… విద్యుతాఘాదానికి గురైన బాలుడు
~ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
~ సుభాష్ నగర్ చివరి బస్ స్టాప్ వద్ద సంఘటన
~ ఆడుకోవడానికి వెళ్ళాడా… లేక పూలు కొయ్యడానికా…?
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 28 : రక్షణ లేని ట్రాన్స్ ఫార్మర్ కారణంగా ఓ బాలుడు విద్యుతాఘాదానికి గురైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో నూరుద్దీన్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ (8)కు తీవ్ర గాయాలు అవడంతో స్థానికులు ఆటోలో సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
వివరాల ప్రకారం… మంగళవారం మధ్యాహ్నం సమయంలో ట్రాన్స్ ఫార్మర్ వద్దకు సదరు బాలుడు ఆడుకోవడానికి వెళ్లగా విద్యుత్ షాక్ తగిలిందని స్థానికులు అంటున్నారు. అయితే ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉన్న చెట్టు పూలు కోయడానికి ట్రాన్స్ ఫార్మర్ దిమ్మ పైకి ఎక్కడం మూలంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని జీడిమెట్ల విద్యుత్ ఏఈ ప్రసూన తెలిపారు. అంతేకాకుండా ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ భవన నిర్మాణ సామాగ్రి వేశారని, వాటి ఆధారంగా బాలుడు ట్రాన్స్ ఫార్మర్ దిమ్మ పైకి ఎక్కగలిగాడని ఆమె అన్నారు. ప్రమాద విషయం తెలియగానే సదురు ప్రాంతాన్ని పరిశీలించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఉన్న భవన నిర్మాణ సామగ్రితో పాటు పూల చెట్టును కూడా తొలగించామని ఏఈ పేర్కొన్నారు.