వాహనాల చోరీల్లో ఆరితేరిన నేరస్థుడు అరెస్టు… రిమాండ్ కు తరలింపు
~ 22 దిచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం
~ సైబరాబాద్, రాచకొండతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోరీలు
~ నిందితుడిని పట్టుకున్న జగద్గిరిగుట్ట క్రైం సిబ్బంది
~ నగదు బహుకరించి ప్రశంసించిన ఏసీపీ హనుమంతరావు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 29: వాహనాల చోరీల్లో ఆరితేరిన నేరస్థుడిని పట్టుకొని 22 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను జగద్గిరిగుట్ట పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జగద్గిరిగుట్ట పీఎస్ లో బాలానగర్ జోన్ డీసీపీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏసీపీ జి. హన్మంతరావు, సీఐ క్రాంతి కుమార్, డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ ఎం. అంజయ్యతో కలిసి మీడియా సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
నిందితుడు మెదక్ జిల్లా శివంపేట్ మండలంలోని లచ్చిరెడ్డి గూడెంకు చెందిన వరెం చంద్రారెడ్డి కుమారుడు వరెం ఆనంద్ రెడ్డి (28) కుత్బుల్లాపూర్ లోని సూరారం కాలనీ కృష్ణానగర్ లోని ప్లాట్ నెంబర్ 125 లో నివాసం ఉంటూ వాహనాల దొంగతనాలకు పాల్పతున్నాడు. వివిధ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల వద్ద పార్కింగ్ ప్రదేశాల్లోని దిచక్ర వాహనాలు, ఆటోలను తస్కరించడమే నిందితుడి ప్రధానం లక్ష్యం ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నిందితుడు సైబరాబాద్ పరిధిలోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో 2 ద్విచక్ర వాహనాలను, బాచుపల్లి, కూకట్పల్లి, కేపీహెచ్బీ, ఆర్సీపురం, మేడ్చల్, పేట్ బషీరాబాద్ లలో ఒక్కొక్క దిచక్ర వాహనం దొంగిలించాడు. అలాగే రాచకొండ పరిధిలోని చౌటుప్పల్ పీఎస్ పరిధిలో ఒకటి, మెదక్ పరిధిలోని శంకరంపేట పీఎస్, తూప్రాన్, గజ్వేల్, ఐడిఏ బొల్లారం పీఎస్, సంగారెడ్డి పరిధిలోని సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్క ద్విచక్రవాహనాన్ని చోరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు.
నిందితుడు ఆనంద్ రెడ్డి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 15 వరకు ఆస్తి నేరాల్లో ప్రమేయం ఉందని, అంతేకాకుండా ఫిర్యాదులు అందిన వాటితో పాటు ఎటువంటి ఫిర్యాదు కానీ… ఆధారాలు కానీ లేని మరో 11 దిచక్రవాహనాలను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కూకట్పల్లి
న్యాయస్థానంలో హాజరు పరిచి రిమాండ్ తరలిస్తామని వారు పేర్కొన్నారు. నిందుతుడిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం సిబ్బందికి ఏసీపీ హన్మంతరావు నగదును బహుకరించి ప్రశంసించారు.