పెళ్లి చేసుకుంటానని యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు అరెస్ట్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి) మే 31 : తన ప్రేమను ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఒప్పుకున్నా అనంతరం ఆ యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితున్ని పట్టుకొని జీడిమెట్ల పోలీసులు శుక్రవారం రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఏసిపి హనుమంతరావు వివరాలు వెల్లడించారు.
జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉండే బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల (22) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. అక్కడే స్థానికంగా ఉండే ఓరుగంటి అఖిల్ సాయి గౌడ్ (26) ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తూ తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. వేధింపులు భరించలేక ఆమె సాయి గౌడ్ ప్రేమను అంగీకరించింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి ఆమె తీసుకొచ్చింది. ఆమె ఇష్టాన్ని కాదనలేక బంధువుల సమక్షంలో అందరూ మాట్లాడడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ప్రేమను ఒప్పుకున్నప్పటికీ అనంతరం సాయి గౌడ్ అఖిలను చాలా ఇబ్బందులకు గురిచేసేవాడు. రోడ్లమీద అందరూ చూస్తుండగానే కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, మానసికంగా, శారీరకంగా వేధించడం తోపాటు ఫోన్లో దుర్భాషలాడేవాడు. అంతేకాకుండా తనకు అధిక కట్నం ఇచ్చే వేరే పెళ్లి సంబంధం రావడంతో అఖిలను పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా దూరం పెడుతున్నాడని అఖిల రాసిన సూసైడ్ నోట్ లో ఉన్నట్లు సమాచారం. సుమారు ఐదు సంవత్సరాలుగా కలిసి తిరిగి ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో మనస్థాపానికి గురైన అఖిల ఈనెల 28వ తారీకు రాత్రి 7:30 గంటలకు తన పడకగదిలోని సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అఖిల తండ్రి కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన జీడిమెట్ల పోలీసులు నిందితుడు అఖిల్ సాయి గౌడ్ నల్గొండలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరావు, డిఐ విజయ్ నాయక్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు