షార్ట్ సర్క్యూట్ తో సుచిత్ర లోని ఓ సెలూన్ లో స్వల్ప అగ్నిప్రమాదం
~ ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘటన
~ సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 23 : విద్యుత్ హెచ్చుతగ్గులతో ఏసీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఒక సెలూన్ షాపు కాలి బూడిదైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… సుచిత్ర సర్వీస్ రోడ్డు లోని ఓ భవనం మొదటి అంతస్తు లో ఉప్పలాస్ ఫ్యామిలీ సెలూన్ ఉంది. సెలూన్ లోని ఓ ఏసి ని ఆన్ చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, ఏసీ ని ఆన్ చేయడంతో మంటలు వచ్చాయని సెలూన్ నిర్వాహకులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో షాప్ లోని ఓ గది పూర్తిగా దగ్ధమవగా, మిగిలిన నాలుగు గదులు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే.. అగ్నిప్రమాదం వల్ల వెలువడిన దట్టమైన పొగ సెలూన్ పై అంతస్తులో (రెండవ అంతస్తు) ఉన్న శ్రీరామ ఇన్సూరెన్స్ లో పని చేస్తున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో ముగ్గురు మహిళలు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. వారిని అంబులెన్స్ లో ఆక్సిజన్ పెట్టి సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్తి నష్టం సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనా.