ఆలస్యంగా ప్రారంభమైన హాస్టల్ సంక్షేమ అధికారి పరీక్షలు… అభ్యర్థుల నిరసన
~ మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో సంఘటన
~ పరీక్షా కేంద్రం ముందు బైఠాయించిన నినాదాలు చేసిన అభ్యర్థులు
~ పోలీసుల రంగ ప్రవేశం.. సద్దుమణిగిన వ్యవహారం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 24 : హాస్టల్ సంక్షేమ అధికారి కోసం పరీక్షలు రాసేందుకు వచ్చిన అభ్యర్థుల నినాదాలతో మైసమ్మగూడ లోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం దద్దరిల్లింది. టిజిపిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జనరల్ స్టడీస్ పేపర్-1 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసిన పరీక్ష గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఆన్ లైన్ ఎగ్జామ్ కావడంతో పాస్ వర్డ్ ఓపెన్ కాకపోవడంతో గంట ఆలస్యమైంది. అనంతరం పేపర్-2 పరీక్ష రాసేందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించడంతో చాలామంది అభ్యర్థులు భోజనం కూడా చేయకుండానే లోనికి వెళ్లారు. అయితే మధ్యాహ్నం 2:30గంటలకు ప్రారంభం కావలసిన పరీక్ష మధ్యాహ్నం 3.30 గంటలైనా ప్రారంభం కాలేదు. దీంతో అసహనానికి గురైన అభ్యర్థులు పరీక్షా కేంద్రం ముందుకు చేరుకుని టీజీపీఎస్సీ, మల్లారెడ్డి కళాశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు.
పరీక్షలు రాసేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు,ప్రాంతాల నుంచి వచ్చామని, పరీక్షలు ఆలస్యంగా మొదలు కావడంతో తిరిగి వెళ్లేందుకు అర్ధరాత్రి అయ్యే పరిస్థితి నెలకొందని, మహిళా అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లు పడే అవకాశం ఉందని వారు మండిపడ్డారు. పేపర్-2 ను రద్దుచేసి మరల వేరే కేంద్రంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ సిఐ విజయవర్ధన్ అక్కడికి చేరుకొని అభ్యర్థులకు సర్ది చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు.