భగత్ సింగ్ నగర్ లో ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి
~ ప్రజావాణిలో డిసికి ఫిర్యాదు చేసిన చింతల్ డివిజన్ కార్పొరేటర్ రషీదా బేగం
~ అనంతరం సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన
~ ప్రజావాణిలో గాజులరామారం సర్కిల్ కు 8, అబ్దుల్లాపూర్ సర్కిల్ కు 7 ఫిర్యాదులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 24 : ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గాజులరామారం ఉప కమిషనర్ ఎల్ పి మల్లయ్యకు చింతల్ డివిజన్ కార్పొరేటర్ రషీదా బేగం, చింతల్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, స్థానికులతో వచ్చి ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. చింతల్ డివిజన్ పరిధి భగత్ సింగ్ నగర్ లోని సర్వేనెంబర్ 155లో ధోబి ఘాట్ పక్కన ఉన్న 1100 గజాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జా చేసి వాటిలో నిర్మాణాలు చేపడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఇదే స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన పలువురిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అప్పట్లో జిహెచ్ఎంసి అధికారులు కూడా సదరు స్థలానికి ప్రహరీ నిర్మించి గేటును కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు కబ్జాకోర్లు సదరు ప్రభుత్వ స్థలంపై కన్నేసి ఆక్రమణకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎంతమంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు పూనుకుంటున్న స్థానికులు ఎప్పటికప్పుడు వారిని నిలువరించి కాపాడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం మరల అదే స్థలంలో కొందరు అక్రమార్కులు అధికారుల అండదండలతో గతంలో ఉన్న లేఅవుట్ ను తమ ఇష్టానుసారం మార్చుకొని రాత్రికి రాత్రి నూతనంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే ఆపి, ఆ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని వారు డిసిని కోరారు. కబ్జాకోరుల చెర నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడే దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అదే స్థలంలో స్థానికులతో కలిసి వంటావార్పు కార్యక్రమాన్ని చేసి స్థలాన్ని రక్షించుకునేందుకు ఎక్కడి వరకు అయినా వెళ్తామని వారు హెచ్చరించారు. అనంతరం గాజులరామారం సర్కిల్ కార్యాలయం ముందు వారు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ నగర్ స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
గాజులరామారం సర్కిల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 8 ఫిర్యాదులు అందగా.. వాటిలో ఇంజనీరింగ్ విభాగానికి 5, పారిశుద్ధ్య విభాగానికి 2, పట్టణ ప్రణాళిక విభాగానికి ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి.
> కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో…
కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం ఏడు ఫిర్యాదులు అందాయి. వాటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి 3, ఇంజనీరింగ్ విభాగానికి 2, విద్యుత్, పారిశుద్ధ్య విభాగానికి ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందాలు. సర్కిల్ పరిధి వెన్నెలగడ్డ లో ఉన్న చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది దుర్గ ప్రసాద్ డిసి నరసింహాకు ఫిర్యాదు అందచేశారు. గత నెల రోజుల క్రితం ఇదే విషయంపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు సదరు అక్రమ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.