లిఫ్టు కోసం తీసిన గుంతలో పడి మేస్త్రి మృతి
~ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లో సంఘటన
~ నిర్మాణదారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం
~ రక్షణ లేక ప్రమాదకరంగా లిఫ్టు గుంత
~ లిఫ్ట్ గుంతే.. నీటి సంపు…
~ మద్యం మత్తులో మేస్త్రి పడి ఉంటాడని సమాచారం
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), జూన్ 28: నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ లో లిఫ్ట్ కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు ఓ మేస్త్రి పడి మరణించిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర సమీపంలోని గ్రీన్ పార్క్ లో గణేష్ బిల్డర్స్ గ్రౌండ్ +5 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణాన్ని చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా చత్తీస్ ఘడ్ కు చెందిన రామ (సుమారు 30 ఏళ్లు) మేస్త్రి పని చేస్తున్నాడు. అయితే గతంలో అదే అపార్ట్మెంట్లో రెండు నెలలు మేస్త్రి పని చేసిన అతను ఇటీవల స్వగ్రామానికి వెళ్లి గురువారం మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి రాత్రి వరకు అతను మద్యం సేవిస్తూనే ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అయితే శుక్రవారం ఉదయం లిఫ్టు కోసం తీసిన గుంతలోని నీటిలో పడి శవమై వారికి కనిపించాడు.
రాత్రి వరకు తమ తోటే ఉన్నాడని, ఏ సమయంలో లిఫ్టు గుంతలో పడ్డాడు తెలియదని, ఉదయం 9 గంటల ప్రాంతంలో లిఫ్టు గుంత వద్దకు అని ఉంది వెళ్తే శవమై కనిపించాడని వాచ్ మెన్ తెలిపాడు. దీంతో వెంటనే బిల్డర్, సూపర్వైజర్ కు సమాచారం అందించానన్నాడు.
• లిఫ్టు గుంతే క్యూరింగ్ సంపు… రక్షణ లేని లిఫ్ట్ గుంత…
లిఫ్టు కోసం తీసిన గుంతనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణదారులు క్యూరింగ్ (నిర్మాణానికి నీరు కొట్టేందుకు) సంపుగా వినియోగించడం గమనార్హం. లిఫ్ట్ గుంతలో సుమారు 5 అడుగుల మేరకు నీటిని నింపి దానిని సంపుగా వినియోగిస్తూ, దానిలో మోటర్ ను ఏర్పాటు చేసి పైప్ లైన్ ద్వారా నిర్మాణానికి క్యూరింగ్ చేస్తున్నారు. దాని కారణంగానే మేస్త్రి ఆ గుంతలో పడి మరణించాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లిఫ్టు గుంతకు అడ్డంగా ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం, కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదకరంగా ఉండడంతో సంఘట చోటుచేసుకుంది. లిఫ్టు గుంత నిండా నీరు ఉండడం, మేస్త్రి మద్యం సేవించి అందులో పడిపోవడంతో మరణించాడని, లేకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని తోటి కార్మికుల అభిప్రాయం. ప్రమాదం జరిగిన అనంతరం లిఫ్టు గుంతకు పాత తలుపును అడ్డంగా ఏర్పాటు చేశారు. నిర్మాణదారులు వచ్చిన అనంతరం సుమారు 11 గంటలకు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించినట్లు సమాచారం.