సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. -ఎమ్మెల్యే వివేకానంద్
• రాష్ట్ర ఖ్యాతిని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ పాలన
• పార్టీలో చేరికలపైనే ప్రత్యేక దృష్టి
• కనీస మద్దతులేని మేయర్, డిప్యూటీ మేయర్
• జీహెచ్ఎంసీపై అజమాయిషీ చెల్లించేందుకు ప్రయత్నం
• ఎస్ ఎన్ డి పీ, ఎస్ ఆర్ డి పీ పనులు కూడా చేయలేని దుస్థితిలో కాంగ్రెస్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 6: హైదరాబాద్ నగర్ తెలంగాణకు గుండెకాయ లాంటిదని, సుమారు కోటి జనాభా ఉన్న నగర అభివృద్ధి రాష్ట్ర ప్రగతిని దోహదం చేస్తుందని, నగర, రాష్ట్ర ఖ్యాతిని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ పరిపాలన సాగుతుందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే శనివారం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం ఎంతసేపు ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకొని రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుంది కానీ, ప్రజా సమస్యలు వారికి పట్టడం లేదని విమర్శించారు. నగర అభివృద్ధిని పక్కనబెట్టి ప్రజలపై కక్ష్యపూరిత వైఖరిని అవలంభిస్తుందన్నారు. నగర పరిధిలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్ కానీ లేరని, కనీస మద్దతు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ లను చేసుకొని తప్పుడు సాంప్రదాయానికి తెర లేపారని మండిపడ్డారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా కేవలం జీహెచ్ఎంసీపై అజమాయిషీ చెలాయించేందుకే చూస్తున్నారన్నారు. కార్పొరేటర్లకు నిధులు కేటాయించకుండా అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డు పడుతుందన్నారు. ప్రజాప్రతినిధులుగా తప్పకుండా ప్రభుత్వాన్ని తాము ప్రశ్నించి నిలదీస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్ ఎస్ డి పీ, ఎస్ ఆర్ డి పీ పనులను కూడా ముందుకు తీసుకెళ్లలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎన్నో సమస్యలపై దృష్టి సారించకుండా అడ్డు పడుతుంది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. మున్సిపల్ శాఖను దగ్గర పెట్టుకొని మంత్రిని కూడా కేటాయించకుండా అభివృద్ధిని ఆగం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని, లేకుంటే రానున్న రోజుల్లో అన్ని వేదికలపై ప్రభుత్వ తీరును ఎండగడతామని హెచ్చరించారు.