గంటలోనే కేసు చేదించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన జగద్గిరిగుట్ట పోలీసులు
– సాంకేతికతతో చకచక్యంగా వ్యవహరించిన పోలీసులు
– పోలీసు సిబ్బందిని అభినందించిన ఉన్నతాధికారులు
జగద్గిరిగుట్ట (న్యూస్ విధాత్రి), ఆగస్టు 13 : సాంకేతికతను ఉపయోగించి చకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదైన కేవలం గంటలోనే కేసును చేదించి వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఇంటి నుంచి పలు సమస్యల కారణంగా వెళ్లిపోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి, ఆసుపత్రిలో చికిత్స అందించి ప్రాణాలతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… పోలీస్ స్టేషన్ పరిధిలో బీరప్ప నగర్ కు చెందిన మాలంపాక బాబీ (28) అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం పలు ఇబ్బందుల కారణంగా ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం తన బావమరిదికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వెంటనే అతని భార్య తెలిసిన వారిని సంప్రదించిన ఆచూకి లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట సీఐ క్రాంతి కుమార్ అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ఆధారంగా సికింద్రాబాద్ లోని మహాకాళి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వెంటనే సిబ్బంది తో పాటు ఫిర్యాదుదారుని కూడా పంపించి ఆచూకీ కోసం గాలించగా ఓ లాడ్జి లో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో జగద్గిరిగుట్ట పోలీసు సిబ్బంది హుటాహుటినా అతని వద్దకు చేరుకున్నారు. అప్పటికే దోమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా గుర్తించి అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి సాంకేతికత సహకారంతో నిండు ప్రాణం కాపాడటంలో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట పోలీసు సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, సీఐ క్రాంతి కుమార్ అభినందించారు.