మాఫీకి నోచుకోని రైతు ‘రుణమాఫీ’…
~ ప్రభుత్వ పోర్టల్ లో తప్పుల తడకగా రుణ గ్రహీతల జాబితా
~ అధికారుల తప్పిదాలు… ఇబ్బందుల్లో రైతులు
~ ఆధార్ కార్డు ఒకరిది.. పేరు మరొకరిది…
~ రుణం తీసుకున్నది ఒకచోట… జాబితాలో చూపించేది మరోచోట..
~ కుత్బుల్లాపూర్ లో 5 శాతం మాత్రమే రైతు రుణమాఫీ
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 18: ఆధార్ కార్డు నెంబరు ఒకరిది.. పేరు మరొకరిది. ఖాతా నెంబరు కరెక్టే కానీ.. రుణం తీసుకున్నది ఒక శాఖలో ఆయితే.. చూపించేది మరో శాఖలో… ఇవి రైతులు రుణాలు పొందిన ప్రభుత్వ పోర్టల్ లో చోటు చేసుకున్న ఆవకతవకలు. ఈ ఆవకతవకలు కేవలం రుణాలు పొందిన సాధారణ రైతులకేvకాకుండా రుణాలను అందించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) బ్యాంకు చైర్మన్ పదవిలో కొనసాగుతున్న ఓ వ్యక్తి విషయంలోనూ చోటు చేసుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు రుణమాఫీకి అర్హత ఉన్నా మాఫీకి ఇప్పటి వరకు నోచుకోలేదు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల లోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ తమ రుణ ఖాతాల్లో ఒక్క నయా పైసా కూడా వేయకపోవడంతో ఎప్పుడెప్పుడు మాఫీ చేస్తారో.. అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు రైతులు.
• అర్హత ఉన్నా.. ఆనర్హులుగా మిగిలిపోయారు…
రైతులు ఆర్హత ఆధారంగా సుమారు రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను పొందారు. ఆ సమయంలో అన్ని వివరాలు, సంబంధిత పత్రాలతో పాటు ఆధార్ కార్డును అధికారులు తీసుకున్నారు. రుణం పొందేందుకు అవసరమైన సంబంధిత పత్రాలతో పాటు ఆధార్ సంఖ్య, పేరు, ఫోన్ నెంబరు, చిరునామా వంటి వివరాలను కంప్యూటర్ లో పొంది పరిచి పీఏసీఎస్ అధికారులు రుణాలను రైతులకు మంజూరు చేశారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా… రైతు రుణామాఫీకి వచ్చే సరికి పరిస్థితి తారుమారైంది. ఖాతా నెంబరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబరు, చిరునామా అన్ని సరిగ్గానే ఉన్నా, రుణ గ్రహీత పేర్లు మారిపోవడం, రుణం తీసుకున్న బ్యాంకు శాఖ కాకుండా మరో ప్రాంతంలోని శాఖలో రుణం తీసుకున్నట్లు చూపించడం వంటి పరిణామాలు ప్రభుత్వ పోర్టల్ లో చోటు చేసుకున్నాయి. తాము రుణం ఇచ్చినప్పుడు అన్ని వివరాలు సరిగ్గానే నమోదు చేసి రుణాలు మంజూరు చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ పోర్టల్లోనే పొరపాట్లు జరిగి రైతులను ఆయోమయానికి గురి చేస్తున్నారని, ఇదే విషయం ఉన్నతాధికారుల పరిశీలనలోనూ తేలిందని వారు తెలిపారు. ఈ అవకతవకల వల్ల రుణమాఫీకి ఆర్హత ఉన్నా ఆనర్హులుగా మిగిలిపోయారు.
• కుటుంబ సభ్యుల నిర్ధారణ అవసరం…
అధికారులు చేసిన తప్పిదాలకు రైతులు బలైపోతున్నారు. రైతులకు రుణమాఫీ రాక ఆయోమయంలో ఉన్నారు. రుణమాఫీకి అర్హులైన తమకు ఎందుకు రుణ మాఫీ కాలేదని పలువురు రైతులు ఆరా తీయగా ఆధార్ లోని పేర్లు, రుణ ఖాతాలోని పేర్లు వేర్వేరుగా ఉన్నాయని, కుటుంబ సభ్యులు నిర్ధారించాలనే సూచన ప్రభుత్వ పోర్టల్ లోని రైతు సమాచారం పత్రంలో సూచిస్తుంది.
• బౌరంపేట శాఖలో 632 మందికి 14 మందికే రుణమాఫి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు నుంచి మొత్తం 632 మంది రైతులు రూ.2,99,61,282 వరకు పంట రుణాన్ని తీసుకున్నారు. దీనిలో 597 మంది రైతులు లక్ష రూపాయలలోపు రుణాన్ని తీసుకోగా, 35 మంది రైతులు రూ. 1 లక్ష నుంచి రూ. 1.60 లక్షల వరకు రుణాలను పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తొలి విడత రుణమాఫీలో 11 మంది రైతులకు గాను రూ.2,67,478 విడుదల చేశారు. రెండవ విడతలో ఒక్క రైతుకు గాను రూ.40,163 విడుదల చేయగా, మూడవ విడతలో ఇద్దరు రైతులకు గాను రూ. 1,23,633 విడుదల చేసింది. దీంతో మూడు విడతలకు కేవలం 14 మంది రైతులకు గాను మొత్తం రూ. 4,31,274 మాత్రమే విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం ఇంకా 618 మంది రైతులకు గాను రూ.2,95,33,008 రుణమాఫీని ప్రభుత్వం చేయాల్సి ఉంది.
• దూలపల్లి శాఖలో 109 మందికి 65 మందికే రుణమాఫీ…
నియోజకవర్గంలోని మరో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం బ్యాంకు దూలపల్లి శాఖ నుంచి మొత్తం 109 మంది రైతులు రూ. 57,09,551 వరకు పంట రుణాన్ని తీసుకున్నారు. దీనిలో తొలి విడత రుణమాఫీలో 51 మంది
రైతులకు గాను రూ. 19,67,317 విడుదల చేశారు. రెండవ విడతలో 12 మంది రైతులకు గాను రూ.10,79,018, విడుదల చేయగా, మూడవ విడతలో ఇద్దరు రైతులకు గాను రూ.1,62,741 విడుదల చేసింది. దీంతో మూడు విడతలకు కలిపి 65 మంది రైతులకు గాను మొత్తం రూ. 32,09,076 విడుదల చేసింది. ఇంకా 44 మంది రైతులకు గాను రూ. 25,00,475 రుణమాఫీని ప్రభుత్వం చేయాల్సి ఉంది.
• రైతు ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి.- ఎమ్మెల్యే వివేకానంద్
రైతు రుణమాఫీ అంతా బూటకమని, కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో కేవలం 5 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మిగిలిన రైతులను నట్టేటముందు చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మండిపడ్డారు. ఈ మేరకు గండిమైసమ్మ చౌరస్తా లోని “దీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్” బ్యాంక్ ముందు రైతు రుణమాఫీ పై ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భౌరంపేట్, దుందిగల్ కి చెందిన రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఎన్నికల అనంతరం డిసెంబర్ 9 లోపు అర్హులైన అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలరుణమాఫి చేశామని చెబుతూ రైతాంగాన్ని మోసం చేసిందని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, చేయలేకపోతే మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి, గద్దె దిగాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేష్, డైరెక్టర్లు భీమ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జీతయ్య, కృష్ణ, సత్తిరెడ్డి, శ్రీనివాస్, జిహెచ్ఎంసి కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, రైతులు పీసరి నర్సిరెడ్డి, భరత్ రెడ్డి, బద్ధం శంకరయ్య, పీసరి కరుణాకర్ రెడ్డి, ఆకుల ఈశ్వరయ్య, నాచారం మల్లేష్ పాల్గొన్నారు.
~ ప్రభుత్వ పోర్టల్ లోనే పొరపాట్లు. -బౌరంపేట పిఏసిఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి
బౌరంపేట శాఖలో రుణ మంజూరుకు కావలసిన సరైన పత్రాలు, వివరాలను ప్రభుత్వ పోర్టల్ లో అప్ లోడ్ చేసి అర్హులైన రైతులకు పంట రుణాలను అందజేశాం. రుణాలు పొందిన చాలామంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ప్రభుత్వ పోర్టల్ ను పరిశీలిస్తే జాబితా అంతా తప్పుల తడకగా మారింది. ఆధార్ కార్డు నెంబర్ తో సంబంధం లేకుండా రుణ గ్రహీత పేరు, రుణం తీసుకున్న బ్యాంకు శాఖ మారిపోవడం గమనించాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే వాటిని సరి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.