కళాశాల యాజమాన్యాల చెలగాటం.. తల్లిదండ్రులకు ప్రాణ సంకటం…
~ ఇంజనీరింగ్ కళాశాలల్లో ‘ సీట్లాట’.
.~ సీట్ల కోసం డొనేషన్ల వసూళ్లు… అనంతరం లేవంటూ ఫోన్లు…
~ కౌన్సిలింగ్ లు ముగిసిన అనంతరం తాపీగా తాజా కబురు
~ ఎటు పోవాలో తెలియక అయోమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు
~ విద్యార్ధి సంఘాలు, జేఏసీలు నిరసనలు, ధర్నాలు
~ బౌన్సర్లతో కళాశాలలకు కాపలా…
~ కానరాని కళాశాలల యాజయాన్యాలు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 22 : ‘ పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణ సంకటం ‘ అన్న చందంగా మారింది ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు వారి తల్లిదండ్రుల ఆశలతో కళాశాలల యాజమాన్యాలు, నిర్వహకులు చెలగాటమాడుతూ వారికి ప్రాణ సంకటంగా వ్యవహరిస్తున్నాయి. ఇంజనీరింగ్ పై మక్కువతో ఎంతో కష్టపడి శ్రద్ధతో చదివి ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించి తీరా… గంపెడాశతో కళాశాలలో సీటు కోసం వెళ్లితే లక్షల రూపాయల్లో డొనేషన్లు దండుకొని చివరాకరికి కౌన్సిలింగ్ లు ముగిసి ఆడ్మిషన్ల సమయంలో సీట్లు లేవని, అడ్మిషన్లు చేయలేమని తాపీగా సమర్థించుకుంటున్నారు. పుణ్య కాలం కాస్త గడిచిపోయే సమయానికి తమ కళాశాలలో సీట్లు లేవని మరే ఇతర కళాశాలలోనైనా చూసుకోవాలని, ఫలానా కళాశాలల్లో సీట్లు ఉన్నాయని, అక్కడ చేరండని సిఫార్సులతో పాటు డొనేషన్లు దండుకొని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు కళాశాలల నిర్వహకులు, ఆధ్యాపకులు. దీంతో అసలు వారు ఏమి చెప్పుతున్నారో..? ఏమి జరుగుతుందో..? భోదపడని తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు ఏమిటని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలనే ఆయోమయంతో కొట్టుమిట్టాడుతున్న సంఘటనలు అనేకం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల వద్ద నిత్యం తారసపడుతున్నాయి. ఇదే పరిస్థితి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లో ఉన్న ఎంఎల్ఆర్ఐఏఈఆర్, ఎంఎల్ఆర్ఐటిఎం, ఎంఎల్ఆర్ఎటీలలో కూడా నెలకొంది.
• కొన్సిలింగ్ కన్నా ముందే కానిచ్చేశారు…
ప్రతీ సంవత్సరం మాదిరిగానే కళాశాలకు యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వం సీట్లు పెంచుతుందనే ఉద్ధేశ్యంతో కౌన్సిలింగ్ కన్నా ముందే కళాశాలలు మేనేజ్మెంట్ కోట (సుమారు 30 శాతం సీట్లు) సీట్లను అమ్ముకున్నాయి. దాని కోసం ఒక్కో సీటుకు డిమాండ్ ను బట్టి సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు రేట్లు పురమాయించినట్లు సమాచారం. కానీ.. రాష్ట్ర ప్రభ్వుతం సీట్లను పెంచకపోగా, కళాశాల యాజమాన్యాలు డిమాండ్ లేని పలు ఇంజనీరింగ్ విభాగాల (సెక్షన్ల) నుంచి సీట్లను తొలగించి డిమాండ్ ఉన్న విభాగాలకు సీట్లను బదిలీ చేయాలని పెట్టుకున్న దరఖాస్తును స్వీకరించి ఆయా విభాగాలను తొలగించింది కానీ.. బదిలీ చేయలేదు.
దీంతో ఆయా విభాగాల సీట్లు కూడా గంగలో కలిసినట్టైంది. దీంతో అసలుకే మోసం వచ్చి పెనంలో రొట్టె పొయ్యిలో పడ్డట్లు అయింది.
• విడుదల కాక ముందే విక్రయించేశారు..
వాస్తవానికి ఎంసెట్ అనంతరం ర్యాంకులు ఆధారంగా మెరిట్ సాధించిన విద్యార్థులకు సీట్లను కేటాయించి మొదటి కౌన్సిలింగ్ అనంతరం కళాశాలలు బి-కేటగిరి పేపర్ నోటిఫికేషన్ విడుదల చేసి మిగిలి ఉన్న (సుమారు 30 శాతం సీట్లు) మేనేజ్ మెంటు సీట్లను వారు విక్రయించాల్సి ఉంటుంది. కానీ.. అత్యాశకు పోయి ప్రైవేటు కళాశాలలు అవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా మొదటి కౌన్సిలింగ్ కన్నా ముందే తమకు ఎన్ని మేనేజ్ మెంట్ సీట్లు విశ్వవిద్యాలయం కేటాయిస్తుందో తెలియకపోయినా ఇష్టానుసారంగా సీట్లను బేరసారాలు పెట్టి అందిన కాడికి దండుకున్నారు.
• నిరసనలు ధర్నాలు చేసినా దిగిరాని యాజమాన్యాలు….
సీట్లు పక్కాగా ఇస్తామని నమ్మబలికి లక్షల్లో డొనేషన్లు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత పత్రాలను కళాశాలు తీసుకున్నాయి. తమ పిల్లలకు ఇంజనీరింగ్ కళాశాలలో సీటు వచ్చేసిందిలే అని నిశ్చింతగా ఉన్న తల్లిదండ్రుల గుండెల్లో బాంబు పేల్చినట్లు కౌన్సిలింగ్ లు కూడా పూర్తి ఆయ్యే సమయానికి వారికి ఫోన్లు చేసి మీ పిల్లలకు సీటు లేదంటూ వచ్చి మీరు చెల్లించిన డబ్బు వాపసు తీసుకోవాలని చావు కబురు చల్లగా చెప్పడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితితో కళాశాల్లో నిత్యం తల్లిదండ్రులకు, కళాశాలల యాజమాన్యాలకు, సిబ్బందికి వాదోపవాదాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీలు నిరసనలు ధర్నాలతో కళాశాలలు దద్దరిల్లుతున్నాయి. వారిని నిలువరించేందుకు కళాశాలల్లో బౌన్సర్ లను, సిబ్బందిని కళాశాల గేట్ల వద్ద కాపలా పెట్టి నడిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కళాశాలల యాజమాన్యాలు దిగి రాకపోవడంతో ఆగ్రహావేశాలతో బాధితులు రగిలిపోతున్నారు.ప్రభాకర్, డొనేషన్లు కట్టిన విద్యార్ధినుల తండ్రి
• సీట్లు ఇవ్వకపోతే కళాశాల ముందు ఆత్మహత్య చేసుకుంటాం.- ప్రభాకర్, విద్యార్థినుల తండ్రి
మాకు ఇద్దరు ఆడపిల్లలు (కవలలు), ఎంసెట్ ఫలితాలు వచ్చిన వెంటనే ఇద్దరికి జూన్ 3వ తేదీన ఒరిజినల్ సర్టిఫికెట్లు, సంబంధిత పత్రాలతో ఎంఎన్ఆర్ఐటిఎంలో సీట్ల కోసం డొనేషన్లు కట్టాను. బుధవారం (21వ తేది) కళాశాల నుంచి ఆకస్మాత్తుగా ఫోన్ చేసి మీ పిల్లలకు సీట్లు రాలేదని తెలపడంతో హుటాహుటిన కళాశాలకు చేరుకొని ఆరా తీస్తే పొంతనలేని సమాధానాలు చెప్పుతూ దాటవేస్తున్నారు. ఇప్పటికే మూడు కౌన్సిలింగ్ లు కూడా పూర్తి అయిపోయిన అనంతరం మా పరిస్థితి ఏమిటి.. మా పిల్లల భవిష్యత్తు ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఆడ పిల్లలకు దగ్గరగా ఉంటుందని సదరు కళాశాలలో సీట్ల కోసం వెళ్తే… ఇప్పుడు ఎక్కడో మెహదిపట్నంలోని ఇతర కళాశాలల్లో సీట్లు ఉన్నాయంటూ అక్కడ ప్రయత్నించుకోండని ఉచిత సలహాలు ఇస్తున్నారు. వీళ్ల తీరుతో ఆయోమయంలో ఉన్న మాకు ఆత్మహత్యే శరణ్యంగా కనిపిస్తుంది. మా పిల్లలకు సీట్లు కేటాయించకపోతే ముగ్గురం వచ్చి కళాశాల ముందు ఆత్మహత్య చేసుకుంటాం.