గణేష్ ఉత్సవ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 29: గణేష్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిల్లో పరిధిలోని చెరువుల వద్ద ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ అన్నారు. రానున్న వినాయక చవితి పండుగ దృష్ట్యా కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్ వి. నరసింహతో కలిసి పోలీసు, ట్రాఫిక్, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, ఆరోగ్య శాఖతో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, సిబ్బందితో జడ్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువుల వద్దకు వెళ్లే రహదారుల్లో మరమ్మత్తులు నిర్వహించాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలన్నారు. గత సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మరలా పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువుల వద్ద ఎప్పటికప్పుడు వ్యర్ధాలను తొలగించి పరిశుభ్రతను పాటించాలని తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలను కల్పించాలన్నారు. చెరువుల వద్ద సిబ్బందిని కేటాయించి భక్తులకు అందుబాటులో ఉండేలా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలనలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ తహశీల్ధార్ అబ్దుల్ రెహమాన్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు, ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ లక్ష్మీ గణేష్, డిసిపి సంతోష్ కుమార్, డి ఈ రఘుపతి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.