ఆది నుంచి టియుడబ్ల్యూజే-ఐజేయు జర్నలిస్టుల పక్షపాతి
• టీయూడబ్ల్యూజే – ఐజేయులో చేరిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు
• స్వాగతించిన జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాస్ కోటగడ్డ
గాజులరామారం (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 29: జర్నలిస్టుల పక్షపాతిగా నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే-ఐజేయు) పాటుపడుతుందని సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు అన్నారు. సూరారంలోని కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే -143 కి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆ సంఘానికి రాజీనామా చేసి టీయూడబ్ల్యుజె – ఐజేయు లో చేరారు. యూనియన్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కోటగడ్డ శ్రీనివాస్, పి. సాయిబాబాలతో కలిసి ఆయన నూతన సభ్యులకు సభ్యత్వాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తున్న సంఘం తమదేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకరంమన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సంక్షేమానికి మంచి రోజులు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని, ఆ దిశగా టియుడబ్ల్యూజే – ఐజేయు కృషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న జర్నలిస్టుల వివరాల సేకరణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ నూతన సభ్యత్వం తీసుకున్న వారిలో శ్రీధర్ ( హెచ్ఎంటీవీ), శర్మ (సాక్షి), ప్రవీణ్ కుమార్ (టెన్ టీవీ), ప్రవీణ్ కుమార్ (టీవీ5), భాస్కర్ రెడ్డి (ఐ న్యూస్), సంతోష్ (బి ఆర్ కె న్యూస్) తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి శేషారెడ్డి, యూనియన్ జిల్లా నాయకులు సూర్యనారాయణ రెడ్డి, నాగేంద్ర చారి, రాజు, లక్ష్మణ్, మల్లేష్, సురేష్ పాల్గొన్నారు.