కుటుంబ డిజిటల్ కార్డు సర్వేకు రంగం సిద్ధం
• ఒక రాష్ట్రం.. ఒకే కార్డే లక్ష్యం
• శుక్రవారం నుంచి ప్రత్యేక అధికార బృందాలతో సర్వే
• కుత్బుల్లాపూర్ లో పైలట్ ప్రాజెక్టుగా ఆయోధ్యనగర్
• అవగాహన కలిగి అందరూ సహకరించాలి.
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆక్టోబర్ 3: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టనున్న తెలంగాణ కుటుంబ డిజిటల్ కార్డు (ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులకు ఒకే గుర్తింపు కార్డు) సర్వేకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒక గ్రామం లేదా మునిసిపల్ వార్డు, డివిజన్ ప్రాతిపదికన ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసి శుక్రవారం నుంచి సర్వేకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధి అయోధ్య నగర్ ప్రాంతాన్ని కుటుంబ డిజిటల్ కార్డు సర్వే కోసం ఎంపిక చేశారు. దీని కోసం సర్కిల్ పరిధిలోని అధికారులు, సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా కేటాయించి ఇంటింటి సర్వే చేసేందుకు ప్రణాళికలు రచించి ముందుకు సాగేందుకు కసరత్తు చేస్తున్నారు.
• కుటుంబ డిజిటల్ కార్డు.. దాని ప్రయోజనాలు…
కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా ప్రతీ కుటుంబానికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడి) ను జారీ చేస్తారు. కుటుంబ ఐడి ఒక కుటుంబానికి చెందిన సభ్యుల సమూహానికి ఒక గుర్తింపుగా ఉంటుంది. ఒక రాష్ట్రం… ఒక కార్డు లక్ష్యంగా ప్రభుత్వం కుటుంబ డిజిటల్ కార్డును ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని గుర్తించడానికి ఒకే ఒక కార్డును వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా ఒక కుటుంబాన్ని సరిగ్గా గుర్తించడంతో పాటు కుటుంబ సమగ్రతను ఒక యూనిట్ గా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా పౌరులు పదే పదే ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ పథకాలకు కానీ కుటుంబ సభ్యుల సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్ కార్డు మంజూరు చేయడం వల్ల ప్రతి వ్యక్తి ఒక కుటుంబంలో మాత్రమే భాగమని నిర్ధారించడంతో పాటు కుటుంబంలోని ప్రతీ వ్యక్తికి ప్రత్యేక వ్యక్తిగత ఐడీ అందించనున్నారు. కుటుంబ నేపథ్యం, స్థితి గతులు, ఆర్థిక స్థితి, పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కుటుంబ డిజిటల్ కార్డును ప్రభుత్వం మంజూరు చేయనుంది.
• సర్వే బృందాల ఏర్పాటు..
నియోజకవర్గాల్లో సర్వే ప్రక్రియను పర్యవేక్షించడానికి ఆర్డీవో, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను నియమించనున్నారు. ముగ్గురు లేదా నలుగురు ప్రభుత్వ అధికారులు ఒక బృందంగా కేటాయించనున్నారు. టీం లీడర్లుగా ఎంపీడీవో, తహసీల్దార్ స్థాయి అధికారులు ఉంటారు. ఒక్కో బృందం ప్రతి రోజు వారికి కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ సుమారు 30 నుంచి 40 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంటుంది. అలాగే వారికి కేటాయించిన గ్రామం లేదా వార్డు లేదా డివిజన్ ను 5 పని దినాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సర్వే పూర్తి ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడంతో పాటు వ్యక్తిగతంగా యాధృచ్చికంగా పరిశీలనలు చేపట్టి ఏ ఒక్క కుటుంబం కూడా మిగలకుండా చర్యలు తీసుకోనున్నారు.
• ప్రాథమిక కుటుంబ వివరాల ఆధారంగా…
ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న ప్రాథమిక కుటుంబ వివరాలను (డేటా) ఆయా బృందాలకు అందించనున్నారు. సదరు డేటా ఆధారంగా సర్వే నిర్వహిస్తూ కుటుంబ సభ్యులు అందించే వివరాలతో సవరణలు, మార్పులు, చేర్పులు చేస్తూ ప్రభుత్వం సూచించిన జాబితా ప్రకారం పొందుపరచాల్సి ఉంటుంది. దీనితో పాటు నూతన కుటుంబం, నూతన సభ్యుని చేరిక, గడువు ముగిసి శాశ్వతంగా మార్చబడిన తొలగింపు, కుటుంబ విభజనతో పాటు వీలైన మేరకు కుటుంబ సభ్యుల గ్రూపు ఫోటో కూడా తీయాల్సి ఉంటుంది సర్వేలో కుటుంబ పెద్దగా ఒక మహిళను నమోదు చేసుకోనున్నారు.
• ప్రతి ఒక్కరూ సహకరించాలి. – వి. నర్సింహ, ఉప కమిషనర్, కుత్బుల్లాపూర్ సర్కిల్
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ప్రతి ఒక్కరూ కుటుంబ డిజిటల్ కార్డుపై అవగాహన కలిగి ఉండాలి. అదే విధంగా డిజిటల్ కార్డు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వే కోసం ఇంటికి వచ్చిన అధికారులకు సహకరించాలి. సర్కిల్
పరిధి అయోధ్య నగర్ ను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని శుక్రవారం నుంచి ముందుకుసాగనున్నాం. ఇప్పటికే అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం.