అనుమతులు రెసిడెన్షియల్… నిర్మాణం కమర్షియల్…
- పైగా సరైన అనుమతులు లేకుండా పబ్బు ఏర్పాటు
- భవనాన్ని, పబ్బును సీజ్ చేయాలని బిజెపి నాయకుల ఫిర్యాదు
నిజాంపేట (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 19: నివాస భవన అనుమతులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలను నిర్మించడమే కాకుండా సరైన అనుమతులు లేకుండా పబ్బు ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి నిజాంపేట మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్ డిమాండ్ చేశారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి ప్రధాన రహదారిలో సర్వేనెంబర్ 57లోని పిస్తా హౌస్ పక్కన ఫ్లాట్ నెంబర్ 61/P లో హెచ్ఎండిఏ నుంచి గ్రౌండ్ తో పాటు ఐదు పై అంతస్తుల (జి+5) నివాస భవన నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. సదరు అనుమతులతో నిబంధనలను ఉల్లంఘించి వ్యాపార సముదాయాన్ని నిర్మించారు. అంతేకాకుండా సదరు నిర్మాణానికి అధికారుల నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ (ఎన్ ఓ సి) పొందకుండానే అక్రమంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా బార్ అండ్ రెస్టారెంట్ తో పాటు టకీలా పేరుతో పబ్బును అక్రమంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని వారు మున్సిపల్ మేనేజర్ కు శనివారం అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమతుల ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని సీజ్ చేసి, సరైన అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన పబ్బును కూడా రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అమలేశ్వరి, అరుణ్ రావు, కుమార్ గౌడ్, కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.