‘పద్మ’ వ్యూహంలో ఇరుక్కున్న సబ్ రిజిస్ట్రార్ జ్యోతి..

• నకిలీ భూ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన కేసులో..
• 14 రోజుల రిమాండ్ కు తరలింపు
• 5 సంవత్సరాల పైచిలుకు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన జ్యోతి
• అనంతరం వచ్చిన వారు వచ్చినట్టే బదిలీలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 29 : కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధి సుభాష్నగర్ లోని ఓ 200 గజాల ఖాళీ స్థల యజమాని బ్రతికుండగానే మృతి చెందాడని నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డులను సృష్టించి ఓ బడా ముఠా
రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి విధితమే. ఈ కేసులో స్థల యజమాని అందించిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు ఈ నెల 4వ తేదీన ఆరుగురు సభ్యుల ముఠాను పట్టుకొని రిమాండుకు కూడా తరలించారు.

అప్పటి కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి

• అప్పటి సబ్ రిజిస్ట్రార్ జ్యోతి రిమాండ్…
సదరు స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన అప్పటి కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సోమవారం జీడిమెట్ల పోలీసులు విచారించి మంగళవారం మేడ్చల్ కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ జూలై 30, 2018లో బాధ్యతలు స్వీకరించిన జ్యోతి ఆగస్టు 25, 2023 వరకు ఏకధాటిగా 5 సంవత్సరాలు పై చిలుకు విధుల్లో కొనసాగారు. అనంతరం వచ్చిన ఏ ఒక్క సబ్
రిజిస్ట్రార్ కూడా ఆ సీటులో ఎక్కువ కాలం నిలువలేకపోయారు. అనంతరం వచ్చిన మహేందర్ 11 మాసాలు. సురేందర్ 2 మాసాల 10 రోజులు,
సురేందర్ స్థానంలో వచ్చిన అశోక్ విధులు స్వీకరించి ఆ మరుసటి రోజు నుంచే దీర్ఘకాల సెలవుపై వెళ్లడంతో మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ మధుకు ఇన్ చార్జీ బాధ్యతలను అప్పగించడంతో ఆయన కొనసాగుతున్నారు. బుధవారం నుంచి అశోక్ విధులకు మరల హాజరు కానునట్టు సమాచారం. కుత్బుల్లాపూర్ నుంచి బదిలీయైన సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సికింద్రాబాద్ ఏ ఆర్ సి (అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్)గా విదులు నిర్వహించారు. అక్కడి నుంచి ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా హైదరాబాద్ ఏ ఆర్ సి గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సదరు కేసు విషయంలో పోలీసుల విచారణ ఎదుర్కోని రిమాండ్ పాలయ్యారు.

• అసలేం జరిగిందంటే…
తీగ లాగితే డొంక కదిలిందనే చందంగా… ఓ వ్యక్తి తన స్థలాన్ని ను నకిలీ భూపత్రాలతో కబ్జా చేసేందుకు చూస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదుతో నకిలీ పత్రాలు సృష్టించే ఓ పెద్ద ముఠా బయట పడింది. దీంతో నకిలీ భూపత్రాలను సృష్టించి తమవి కానీ భూములను అప్పనంగా స్వాధీనం చేసుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను జీడిమెట్ల పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లోని ప్లాట్ నెంబర్ 147లో ఉన్న తన 200 గజాల స్థలాన్ని నకిలీ భూపత్రాలతో కబ్జా చేశారని ఉప్పుగూడలోని హనుమాన్ నగర్ కు చెందిన బాధితుడు ఎల్. సురేష్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా నకిలీలల బాగోతం బయటపడింది. కేవలం ఫిర్యాదు అందిన సుభాష్ నగర్లోని ఆ ఒక్క ప్లాటే కాకుండా నగరంతో పాటు పక్క రాష్ట్రంలోని స్థలాలకు కూడా సదరు ముఠా ఎసరు పెట్టిన నకిలీ పత్రాలు పోలీసులకు చిక్కాయి.

• సూత్రధారి కత్బుల్లాపూర్ పద్మక్క…
సుభాష్ నగర్ లోని సురేష్ స్థలాన్ని కాజేసేందుకు పద్మజా రెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క (32) అనే బీఆర్ఎస్ నాయకురాలు హయత్ నగర్ కు చెందిన రేపాటి
కరుణాకర్ (34) అనే వ్యక్తిని (గతంలో దారి దోపిడిల నిందితుడు) సంప్రదించి అతనికి రూ. 3.50 లక్షలు ఇచ్చి నకిలీ భూపత్రాలు సృష్టించేందుకు ఒప్పందం
కుదుర్చుకుంది. దీంతో స్థల యజమాని సురేష్ 1992లో చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆధార్ కేంద్రంలో పని చేసే ఆపరేటర్ నరేంద్ర (25)
సహాయంతో నకిలీ భూపత్రాలు సృష్టించి ముఠాలోని రవి శంకర్ (38), హరీష్ (36)లను భూ విక్రయదారులుగా సంబంధిత పత్రాల నకిలీలు తయారు చేశారు. వాటి ఆధారంగా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అప్పటి సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సహకారంతో 2023 ఫిబ్రవరి 22వ తేదీన కుత్బుల్లాపూర్ పద్మక్క తన చెల్లెలు నాగిరెడ్డి కోమల కుమారి (49) పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. సదరు రిజిస్ట్రేషన్ పత్రాలతో అసలు భూ యజమాని సురేష్ ను బెదిందించి, భయపెట్టి వెళ్లగొట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆసలు గుట్టు రటైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందుతులను రిమాండ్ కు తరలించారు. ప్రధాన సూత్రధారి పద్మక్కను జీడిమెట్ల పోలీసులు పలుమార్లు విచారించి వివరాలు సేకరించారు. ఆమె తెలిపిన ఆధారాల ప్రకారం అనంతరం రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ జ్యోతి పాత్రపై కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించి విచారణ చేపట్టి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ ను విధించారు. నకిలీ ముఠా కేవలం సుభాష్ నగర్ లోని స్థలంతో పాటు హయత్ నగర్ లో 274 గజాలు, జూబ్లీహిల్స్ లోని 1000 గజాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ లో మరో స్థలాన్ని కాజేసేందుకు పన్నాగం పన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More