సొంత ఇంట్లో… అక్రమ అద్దె గర్భాల దందా
• గుట్టు చప్పుడు కాకుండా నిర్వాకం
• అక్రమ వాణిజ్య సరోగసీ రాకెట్ బట్టబయలు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
• పేద, ఆర్థిక ఇబ్బందులు కలిగిన మహిళలు…
• సంతానోత్పత్తి లేని ధనవంతులే లక్ష్యంగా అక్రమార్చన
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 15: ఓ వైపు పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని, మరోవైపు పిల్లలు లేని, ధనవంతులనే లక్ష్యంగా చేసుకొని సులువుగా అక్రమార్చన కోసం సొంత ఇంట్లో అక్రమ అద్దె గర్భాల (సరోగసి) దందాకు ఓ ముఠా తెరలేపింది. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం చేసిన వ్యవహారం మర్చిపోకముందే నగరంలో ని కుత్బుల్లాపూర్ లో పెట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలోని సాయిబాబా నగర్ మరో ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అక్రమ సరోగసి వ్యాపారంపై సమాచారం అందుకున్న పెట్ బషీరాబాద్ పోలీసులు దాడి చేసి రాకెట్ గొట్టును రట్టు చేశారు. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్యాధికారి ఉమా గౌరీ తో కలిసి వివరాలను శుక్రవారం వెల్లడించారు.

సాయిబాబా నగర్ లోని ఓ ఇంట్లో అక్రమ వాణిజ్య సరోగసి కేంద్రాన్ని తల్లి కొడుకులు కలిసి కొంతమంది మహిళలతో నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రధాన నిందితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిలకలూరిపేటకు చెందిన నర్రెద్దుల లక్ష్మీరెడ్డి, కొడుకు నర్రెద్దుల నరేందర్ రెడ్డితో కలిపి మరో అరుగురు సరోగేట్ తల్లులైన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన గోల్కొండ సాయి లీల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రంపచోడవడానికి చెందిన మాలగల్ల వెంకటలక్ష్మి, సదల సత్యవతి, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పి. సునీత, విజయనగరం జిల్లాకు చెందిన పంటడ అపర్ణ, జె. రమణమ్మలతో కలిపి మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా పలు ఫెర్టిలిటీ క్లినిక్‌లతో కలిసి చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు జరిపారని డిసిపి తెలిపారు.

• సరోగెట్ తల్లి నుంచి సరోగేట్ తల్లుల సరఫరా వరకు…
ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి గతంలో అండం దాత, సరోగేట్ తల్లిగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో క్రమేనా
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను లక్ష్యంగా తీసుకొని, వారిని దాతలు, సరోగేట్ తల్లులుగా మార్చేందుకు పూనుకుంది. వారిని పలు ఫెర్టిలిటీ క్లినిక్‌లకు పంపించి ఇరువైపుల నుంచి అవసరాన్ని, స్థాయిని బట్టి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసేదని వారు తెలిపారు. దీనికి జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి అక్రమ సరోగసి కేంద్రం నడిపేందుకు అండగా నిలిచాడు. లక్ష్మీ రెడ్డి గతంలో ముంబైలో ఇదే తరహా దందాను నిర్వహించి పట్టుబడడంతో ఐపీసీ 370, జై జై యాక్ట్ 75, 81, 83 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితురాలుగా అక్కడి పోలీసులు చేర్చారు.
ప్రస్తుతం అక్రమ సరోగసి కేంద్రానికి సంబంధించి నిందితులపై సరోగసీ నియంత్రణ చట్టం 38, 39, 40, 41, అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం 33, 34, బిఎన్ఎస్ చట్టం 318(4), 61(2) ప్రకారం కేసులు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నారు.

• పోలీసులు జప్తు చేసుకున్న నగదు, వస్తువులు…
నిందితుల నుంచి రూ. 6,47,000 నగదు, ఒక ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్స్, నాన్-జ్యుడిషియల్ బాండ్ పేపర్లు, పెద్ద మొత్తంలో సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు,5 స్మార్ట్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోన్ తో పాటు నగరంలోని మాదాపూర్ లో ఉన్న హెగ్డే, లక్స్ హాస్పిటల్స్ నుంచి సాయి లక్ష్మి, నేహా కు సంబంధించిన కేసు షీట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్‌ను ఛేదించడానికి ఎస్ఓటి మేడ్చల్ అదనపు డిసిపి ఎ. విశ్వ ప్రసాద్ నాయకత్వంలో పెట్-బషీరాబాద్ ఏసీబీ ఎ.సి. బాల గంగి పర్యవేక్షణలో పేట్ బషీరాబాద్ పిఎస్ కి చెందిన పోలీసు బృందం, మేడ్చల్ ఎస్ఓటి బృందం దాడి చేసి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వైద్యాధికారి సి. ఉమా గౌరి సహాయంతో నిందితులను పట్టుకున్నారు.