అక్రమ హోర్డింగ్లపై ఉదాసీనత ఎందుకు…?
• దుండిగల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నిడదీసిన హైడ్రా అధికారి
• అక్రమ హోల్డింగ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 20: దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) అధికారులు, సిబ్బంది ఉన్నట్లా…? లేనట్లా…? మరి ఉన్నట్లయితే మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందకుండా ఇష్టానుసారం వెలుస్తున్న అక్రమ హోర్డింగ్లను ఎందుకు ఉపేక్షిస్తున్నారని సంబంధిత అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలోని చైన్ మెన్ల పై మండిపడ్డట్లు సమాచారం. అక్రమ హోర్డింగ్లపై దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ పరిధిలో ఉన్న మొత్తం హోర్డింగుల వివరాలతో పాటు వాటిలో అనుమతులు పొందిన హోర్డింగులు, అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మున్సిపల్ పరిధిలోని అక్రమ హోర్డింగ్ లపై ఎందుకు దృష్టి సారించడం లేదని, అనుకోని ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నిలదీశారు. కళ్ళముందే భారీ అక్రమ హోర్డింగులు కనిపిస్తున్న వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని హోర్డింగ్లపై పదే పదే అడిగిన నివేదికను ఇవ్వడంలో జాప్యం ఎందుకని సిబ్బందిని నిలదీశారు. మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్లను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. అక్రమ హోల్డింగ్లతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.