• రూ.72 కోట్ల విలువ చేసే 220 కిలోల ఎఫెడ్రిన్ స్వాధీనం
• ఐడిఏ బొల్లారం లోని ఓ రసాయన పరిశ్రమలో తయారీ..
• సుచిత్ర సమీపంలోని స్ప్రింగ్ కాలనీ ప్లాట్ లో నిల్వ
• పక్కా సమాచారంతో దాడి… నలుగురు కీలక నిందితులు అరెస్ట్
• పరారీలో ప్రధాన నిందితుడు
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 9: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల తయారీ నెట్‌వర్క్‌పై ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) అధికారులు పంజా విసిరారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సుచిత్ర సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలోని ఒక ఫ్లాట్‌పై దాడి చేసి, 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్ ను గురువారం స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.72 కోట్లు ఉండవచ్చని అంచనా. వివరాల ఆధారంగా… ఈగిల్ అధికారులు అక్టోబర్ 9వ తేదీ ఉదయం స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలోని సాయి దత్తా రెసిడెన్సీ లోని ఫ్లాట్ నంబర్ 101పై దాడి చేసి, నలుగురు మాదకద్రవ్యాల తయారీదారులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాకినాడకు చెంది స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో నివాసముంటూ ఆక్వా కల్చర్ వ్యాపారం నిర్వహిస్తున్న వస్తావాయి శివ రామకృష్ణ పరమ వర్మ (52), సుభాష్ నగర్ లో నివసిస్తూ ఐడిఏ బొల్లారం లోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న దంగేటి అనిల్ (31), తూర్పుగోదావరి జిల్లాకు చెంది అపురూప కాలనీలో నివాసముంటూ విగ్నసాయి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రొడక్షన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ముసిని దొరబాబు (29), తిరుపతిలోని సూళ్లూరుపేటకు చెంది గాజులరామారం లోని హెచ్ఏఎల్ కాలనీలో నివాసమంటూ ఐడిఏ బొల్లారం లోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ పరిశ్రమ డైరెక్టర్ గా ఉన్న మద్దు వెంకట కృష్ణారావు (45) ఉన్నారు. తిరుపతిలోని సూళ్లూరుపేటకు చెంది గాజులరామారం లోని హెచ్ఏఎల్ కాలనీలో నివాసమంటూ ఐడిఏ బొల్లారం లోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు మరో డైరెక్టర్ గా ఉన్న ఎం. ప్రసాద్ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ. 70 కోట్లు విలువచేసే 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్ , 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

• అసలు తయారీ ఎలా…
దర్యాప్తు ప్రకారం…ప్రధాన నిందితుడు శివ రామకృష్ణ పరమ వర్మ గతంలో 2017లో ఒకసారి బెంగళూరులో, మరోసారి 2019వ సంవత్సరంలో హైదరాబాదులో మొత్తం రెండుసార్లు మాదకద్రవ్య కేసుల్లో అరెస్టు చేసి వరుసగా 250 కిలోల యాంఫెటమైన్, 10 కిలోల ఆల్ప్రజోలం స్వాధీనం చేసుకున్నాయి. 2024 చివరలో అతను పిఎన్ఎమ్ లైఫ్ సైన్సెస్ ప్రొడక్షన్ మేనేజర్ అనిల్‌ను సంప్రదించి, ఎఫెడ్రిన్ తయారీకి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశాడు. దీంతో అనిల్ ఆ ఆఫర్‌ను పరిశ్రమ యజమానులైన వెంకట కృష్ణారావు, ప్రసాద్‌తో చర్చించి వారి అనుమతితో రహస్యంగా ఉత్పత్తి ప్రారంభించాడు. టోలుయిన్, బ్రోమిన్, అసిటోన్, సోడియం హైడ్రాక్సైడ్ ఫ్లేక్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి ముడి పదార్థాలను ఉపయోగించి మూడు దశల ప్రాసెసింగ్ చేసి 220 కిలోల ఎఫెడ్రిన్ తయారు చేశారు. తయారైన డ్రగ్‌ను సుచిత్రా సమీపంలోని సాయి దత్తా రెసిడెన్సీ ఫ్లాట్‌లో నిల్వ ఉంచారు.

• పకడ్బందీగా నిఘా పెట్టి…
తెలంగాణ రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈగిల్ బృందాలు పాత మాదకద్రవ్య నేరస్థులపై రహస్య నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు శివ రామకృష్ణ పరమ వర్మ కూడా నిఘా పెట్టి అతను తరచు సందర్శించిన పరిశ్రమలు, అనుమానాస్పద లావాదేవీలు, కీలక నిందితులు గుమ్మి కూడిన విధానం ఆధారంగా ఈగల్ ప్రత్యేక బృందం దాడి చేసి నలుగురు నిందితులను పట్టుకున్నారు. అంతేకాకుండా పరిశ్రమ లీజు డీడ్, బోర్డు మీటింగ్ మినిట్స్, బ్యాంక్ లావాదేవీలు అన్ని నిందితుల ప్రమేయాన్ని స్పష్టంగా చూపుతున్నాయని ఈగిల్ అధికారులు వెల్లడించారు. వాటి ఆధారంగా పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ పరిశ్రమను అధికారులు సీజ్ చేశారు.

• ఎఫెడ్రిన్ దుష్ప్రభావాలు…
ఈగల్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎఫెడ్రిన్ డ్రగ్ అత్యంత ప్రమాదకరమైన, వ్యసనపరమైన మాదకద్రవ్యం అని, దీనిని వినియోగించడం వల్ల ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి,వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, మానసిక అస్థిరత వంటి ప్రభావాలు తలెత్తుతాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఇది మెథాంఫేటమైన్ తయారీలో ముడి పదార్థంగా ఉపయోగపడుతుండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర పది రెట్లు అధికం ఉంటుందన్నారు.
• ఈగల్ అధికారుల సూచన…
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి. ఎటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. రసాయన పరిశ్రమల రూపంలో జరుగుతున్న అక్రమ డ్రగ్ ఉత్పత్తి ఇకపై కఠిన చర్యల పాలవుతుందని ఈగిల్ అధికారులు హెచ్చరించారు. మాదకద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.