ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసిన హైడ్రా
• పేట్‌బషీరాబాద్ సర్వేనెంబర్ 25/2లో చర్యలు
• జర్నలిస్టులకు కేటాయించిన 38 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె నిర్మాణం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 22: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 25/2 లోని 38 ఎకరాల భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది. గతంలో భూమిని జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జెఎన్జెఎంఏసిహెచ్ఎస్)కి రాష్ట్ర ప్రభుత్వం 2008లో కేటాయించింది.
ఈ భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తూ ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధీనంలో పెట్టింది. అయితే ఈ కేటాయింపులపై కొంతమంది కోర్టుకెళ్లడం వల్ల అక్కడ జర్నలిస్టులకు స్థలాల పంపిణీ జరగలేదు. కోర్టులో వివాదం ఉంటుండగానే.. మరోవైపు అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని జెఎన్జెఎంఏసిహెచ్ఎస్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై అక్కడ రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయమై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించుకుంది. ఇప్పటికే కొంతమంది ఇళ్లు కట్టుకుని ఉండగా.. వాటి జోలికి పోకుండా ఇంకా ఖాళీగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ విషయంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలం కేటాయింపులు జరుగుతాయని, ఈ లోగా అక్రమణలు జరగకుండా ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టు హైడ్రా స్పష్టం చేసింది. అలాగే అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఈ సమావేశంలో హైడ్రా, రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు కూడా ఉంటారని తెలిపారు.