ఘనంగా ముగిసిన హెచ్ఎంటి ప్రీమియర్ లీగ్ సీజన్–4
• యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా మారిన కుత్బుల్లాపూర్ హెచ్ఎంటి గ్రౌండ్స్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 10: క్రీడలు, క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని, క్రీడల ద్వారా స్నేహభావం, ఐకమత్యంతో పాటు యువత పెడదోవ పట్టకుండా ఉంటారని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బికేఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు బొంగునూరి కిషోర్ రెడ్డి అన్నారు.

కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ హెచ్ఎంటి గ్రౌండ్స్‌లో నిర్వహించిన హెచ్ఎంటి ప్రీమియర్ లీగ్ సీజన్ – 4 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ పోటీలు నిర్వాహకులు ఫయాజ్, నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక యువత మరియు క్రీడాభిమానుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ సీజన్లో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. వీటిని ఏ, బి గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూపులో నాలుగు జట్లు తలపడి లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన సంతు బ్లాస్టర్స్ జట్టుకు కిషోర్ రెడ్డి ట్రోఫీని అందజేశారు. అలాగే రన్నరప్ గా నిడచిన రమేష్ ఎన్ హెచ్ ఆర్ జట్టుకు ట్రోఫీతో పాటు సీజన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆకర్షణీయమైన బహుమతులను అందజేశారు. ఈ పోటీలకు ప్రత్యేక ఆకర్షణగా స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియూడబ్ల్యూజే–ఐజేయు) కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కలికి మూర్తి యర్రంశెట్టి, కార్యవర్గ సభ్యులు నాగబాబు హాజరై ఆటగాలను ఉద్దేశించి ప్రసంగించారు. నిర్వాహకులు ఫయాజ్, నాగరాజు మాట్లాడుతూ, “హెచ్ఎంటి ప్రీమియర్ లీగ్ కేవలం క్రికెట్ పోటీ మాత్రమే కాదు. యువతలోని ప్రతిభను వెలికితీసే వేదికగా, స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించే అవకాశంగా భావిస్తున్నాం” అని తెలిపారు. భవిష్యత్తులో ఈ పోటీని మరింతగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు.

క్రీడా మైదానమంతా ఆటగాళ్ల ఉత్సాహం, ప్రేక్షకుల హర్షధ్వానాలతో మార్మోగింది. దీంతో హెచ్ఎంటి గ్రౌండ్ నిజమైన క్రికెట్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, గజా, భరత్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, కృష్ణ మహాలక్ష్మి నగర్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, జయసింహ, మహిపాల్ రెడ్డి, పండు, కరీం, ఇక్బాల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.