తెలంగాణ జాగృతి పార్టీలో చేరిక ఎస్సీ 57 కులాల రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం
• కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరిక
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 16: సామాజిక న్యాయం సాధించాలంటే రాజకీయ శక్తి అవసరమనే నమ్మకంతో కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతి పార్టీలో ఎస్సీ 57 కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు చింతల రాజలింగం అధికారికంగా సోమవారం చేరారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ 57 కులాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఆయన పదవుల కోసమో, అధికారం కోసమో కాదని, ప్రజల గౌరవం, ఆత్మ గౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రాల సమస్యల నుంచి ప్రారంభించి, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడి పోరాడానన్నారు. జిల్లాల్లోనైనా, మండలాల్లోనైనా, ఏ గ్రామంలోనైనా తమ వర్గాల వారికి కష్టం వస్తే ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిల వరకు వెళ్లి న్యాయం పోరాటం చేశానని రాజలింగం అన్నారు.

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు నిజంగా ఎదగాలంటే మాటలతో కాదనీ, శక్తివంతమైన వేదిక, దిశానిర్దేశం, ఉద్యమ ఆత్మతో ముందుకు రావాలని అందుకోసం తెలంగాణ జాగృతి పార్టీనే సరైన మార్గమనే విశ్వాసాన్ని వ్యక్తం చేసి అందులో చేరానన్నారు. ఇప్పటి నుంచి తన పోరాటం మరింత ఉత్సాహంతో, మరింత దృఢ సంకల్పంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు.