కుత్బుల్లాపూర్లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు
• ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 20:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పద్మా నగర్ ఫేజ్ 2 సర్కిల్ లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శివాజీ వారియర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్, మాజీ కార్పొరేటర్ కేయం. గౌరీష్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అంతకుముందు వారు జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజంలో ధర్మం, న్యాయం, స్వాభిమానం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తాయని, చరిత్ర మహానుభావుల స్ఫూర్తిని కొత్త తరాలకు చేరవేయడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.

అనంతరం కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు, దేశభక్తి గీతాలపై చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన నాటిక ప్రేక్షకులను కట్టిపడేసింది. స్థానిక కళాకారులు దేశభక్తి గేయాలు ఆలపించగా, మహిళా బృందాలు సంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే వివేకానంద్ చిన్నారుల ప్రతిభను ప్రశంసిస్తూ వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శివాజీ వారియర్స్ సభ్యులు, కాలనీ వాసులు, యువజన సంఘాల సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.