అక్రమ నిర్మాణంపై బాధితురాలి ఫిర్యాదులు… అయినా చర్యలు శూన్యం
• పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
• నిర్మాణ దశలో నిమ్మ కుండి…
• భవనం పూర్తయిన అనంతరం కూలుస్తామని హితవు పలుకుతున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది
• కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌కు మరోమారు ఫిర్యాదు చేసిన బాధితురాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మార్చి 31: అనుమతులకు విరుద్ధంగా పక్కవారి స్థలంలోకి చొరబడి భవన నిర్మాణం చేపడుతున్న నిర్మాణదారుడిపై ప్రజావాణిలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ కు మరోమారు బాధితురాలు ఫిర్యాదును అందజేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జీడిమెట్ల సర్కిల్ పరిధి బ్యాంక్ కాలనీలో ఓ అక్రమ నిర్మాణం వివాదంగా మారింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ కాలనీలో తమకు చెందిన ప్లాట్ నెం.1 పక్కన ఉన్న ప్లాట్ నెం.2 లో నిర్మాణదారులు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణ పనులు చేపట్టారని ఆరోపించారు. నిర్మాణ సమయంలో సెట్ బ్యాక్ ల నిబంధనలు పాటించకపోవడంతో పాటు, తమ ఇంటి ప్రహరీ కూడా పై నిర్మాణ పనులు చేపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణ పునాదుల సమయంలోనే తమ స్థలంలోకి చొచ్చుకొని రావడంతో నిర్మాణదారుని పలుమార్లు హెచ్చరించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పెడచెవిన పెట్టాడని తెలిపారు. అంతేకాకుండా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి… ఎవరితోనైనా చెప్పుకోండి అని దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై అప్పటి ఉప కమిషనర్ తో పాటు పట్టణ ప్రణాళిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశామని అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఆమె వాపోయారు. ఫిర్యాదు చేసినప్పుడల్లా ‘భవన నిర్మాణం పూర్తి కానివ్వండి పూర్తయిన తర్వాత ప్రోక్లైనర్ తీసుకువచ్చి కూల్చేస్తాం’.. అని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలపడం అనుమానాలకు తావిస్తోంది. పునాదుల స్థాయిలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం సదరు నిర్మాణం ఎస్+2, పెంట్ హౌస్ దశకు చేరుతుందని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అధికారికంగా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్‌కు మరోమారు ఫిర్యాదు చేస్తూ, అక్రమ నిర్మాణంపై తక్షణ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు.