తాగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ధర్నా

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 10: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలు, లో ప్రెషర్, పారిశుధ్య లోపాలు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి ఐడిపిఎల్ లో ఏపీఎచ్‌బీ కాలనీలోని జలమండలి కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు తాగునీరు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని, లో ప్రెషర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్ల పరిధిలోని అనేక కాలనీలలో తాగునీటి సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నదని ఆరోపించారు. ముఖ్యంగా తక్కువ ఒత్తిడితో నీరు రావడం, నిర్ణీత సమయాలకు సరఫరా లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో రోజులు గడిచినా నీరు అందకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నీటి కోసం  గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు కాలనీలలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడం వలన మురుగునీరు రోడ్లపైకి చేరుతోందని పేర్కొన్నారు. దీంతో దోమలు, దుర్వాసన సమస్యలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ధర్నా అనంతరం బీఆర్ఎస్ నాయకులు జలమండలి జనరల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించడం, లో ప్రెషర్ సమస్యను తక్షణమే పరిష్కరించడం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం, అవసరమైన ప్రాంతాల్లో డ్రైనేజీ మరమ్మతులు చేపట్టడం వంటి పనులతోప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జనరల్ మేనేజర్ సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More