ప్రభుత్వ భూమిని కబ్జా చేసి… అధికారులు వెళ్లగానే బెదిరింపులు..!
• ఆత్మహత్య చేసుకుంటానని డ్రామా
• గాజులరామారం సర్వేనెంబర్ 79 లో ప్రభుత్వ స్థలం ఆక్రమణ, అనధికార నిర్మాణం
• ఫిరోజ్ ఖాన్‌పై క్రిమినల్ కేసు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 12 : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అనధికార నిర్మాణం చేపట్టడమే కాకుండా, దానిని తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను అడ్డుకొని బెదిరించిన ఘటన కుత్బుల్లాపూర్ మండలంలో కలకలం రేపింది. ఈ ఘటనలో నెహ్రూ నగర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

• గాజులరామారం సర్వేనెంబర్ 79లో ప్రభుత్వ స్థలం ఆక్రమణ…
మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గాజులరామారం గ్రామంలోని సర్వే నెం.79లో ఉన్న ప్రభుత్వ భూమిని ఫిరోజ్ ఖాన్ అక్రమంగా ఆక్రమించి, అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణం జరుగుతోందని సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పరిశీలించి, ఆక్రమణను తొలగించేందుకు చర్యలు ప్రారంభించారు.
• అధికారులతో వాగ్వాదం… ఆత్మహత్య డ్రామా..
ఈ నెల 11న అధికారులు సంబంధిత స్థలానికి చేరుకుని అనధికార నిర్మాణాన్ని కూల్చివేసే ప్రక్రియ చేపట్టేందుకు ప్రయత్నించగా, ఫిరోజ్ ఖాన్ అడ్డుపడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా, నిర్మాణాన్ని తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించి అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, చట్టబద్ధంగా విధులు నిర్వహించేందుకు వెళ్లిన అధికారులను బెదిరించడం తీవ్రంగా పరిగణించిన రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
• మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం…
ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన సమయంలో కొందరు ఆక్రమణదారులు అధికార యంత్రాంగాన్నే సవాలు చేస్తూ వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు, అనధికార నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న వేళ, ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు భూ రికార్డులు, సంఘటనకు సంబంధించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తైన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.