వినూత్నంగా సర్ పై చైతన్యం కల్పిస్తున్న జీడిమెట్ల సర్కిల్ అధికారులు

• కళా ప్రదర్శనలతో ఓటర్లకు అవగాహన
• పారిశుధ్యం ప్రతి పౌరుడి బాధ్యత. – డిసి శంకర్ సింగ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 25: ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఏఈఆర్వో, ఉప కమిషనర్ శంకర్ సింగ్ పిలుపునిచ్చాయి. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జీడిమెట్ల సర్కిల్ పరిధిలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)–2026 కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు పారిశుధ్యంపై అవగాహన పెంపొందించేందుకు శనివారం వినూత్న రీతిలో నిర్వహించారు. కళా బృందాల పాటల ద్వారా ఓటర్లు, స్థానిక ప్రజలను చైతన్యపరిచారు.

పాటలు పాడుతున్న కళాకారులు

శనివారం ఉదయం చింతల్‌లోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో, సాయంత్రం పద్మానగర్ రింగ్‌రోడ్ వద్ద ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున హాజరై కళా ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు. కళా బృందాలు ప్రత్యేక సమగ్ర సవరణ–2026 నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన పాటలను పాడి అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో ఉందో, లేదో పరిశీలించుకోవాలని, కొత్తగా అర్హత పొందిన వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, వివరాల్లో మార్పులు ఉంటే సకాలంలో సరిచేసుకోవాలని శంకర్ సింగ్ సూచించారు. అదేవిధంగా పారిశుధ్యంపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించారు. ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని, చెత్తను రోడ్లపై లేదా ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా పరిశుభ్రమైన పరిసరాల కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి వినూత్న అవగాహన కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసి ఉదయ్ కుమార్, సూపరిండెంట్లు గిరిబాబు, జవహర్ నాయక్, బిఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More