దుండిగల్‌లో గంజాయి ముఠాకు పోలీసుల షాక్!
~ 426 కిలోల గంజాయి స్వాధీనం.. రూ.2.28 కోట్లకు పైగా విలువ
~ ఆరుగురు అరెస్ట్.. మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు
~ డీసీఎంలో గంజాయి.. ముందు స్విఫ్ట్ కారులో ఎస్కార్ట్.. ఓఆర్ఆర్ ఎగ్జిట్-5 వద్ద పట్టివేత
దుండిగల్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 19 :
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తున్న ముఠా కదలికలను పసిగట్టిన ఎస్వోటి కుత్బుల్లాపూర్ జోన్ బృందం, వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి సుమారు 426 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.2,28,87,350గా పోలీసులు వెల్లడించారు.
~ ఎస్కార్ట్‌గా స్విఫ్ట్.. గంజాయితో డీసీఎం…
ఈ మేరకు విలేకరుల సమావేశంలో కుత్బుల్లాపూర్ డిసిపి కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా నుంచి గంజాయిని సేకరించిన నిందితులు, దానిని మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గంజాయిని ఐషర్ డీసీఎం వాహనం (ఎంహెచ్13 బిక్యూ 5332)లో తరలిస్తుండగా, దానికి రక్షణగా స్విఫ్ట్ కారు (ఓడి02డి3300)ను ఎస్కార్ట్‌గా ముందు నడిపించారు. అయితే వారి కదలికలపై నిఘా ఉంచిన ఎస్వోటి కుత్బుల్లాపూర్ జోన్ బృందం సెప్టెంబర్ 18న రాత్రి 8 గంటల సమయంలో దుండిగల్ సర్వీస్ రోడ్డులోని ఓఆర్ఆర్ ఎగ్జిట్-5 వద్ద వాహనాలను అడ్డుకుని తనిఖీ చేపట్టింది. దీంతో భారీగా గంజాయి బయటపడటంతో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
~ ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు పరారీ..
అరెస్టయిన వారిలో సురంగిని పరిచ్చ అలియాస్ సునీత (41), బాలు గణపత్ కదం అలియాస్ నానా (52), ఉపలబ్ద్ మంగళేష్ భోంస్లే అలియాస్ వికాస్ భోంస్లే (34), సమాధాన్ గోకుల్ థోరట్ అలియాస్ సోము (30), రాజు చవాన్ (39), అరుణ్ బాబురావు చెండ్కే ఉన్నారు. ఈ కేసులో దక్షిణ షోలాపూర్‌కు చెందిన అవినాష్ బాబు రాథోడ్, బారామతికి చెందిన అభిజిత్ థాటే పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

~ రూ.2.28 కోట్ల గంజాయి.. రెండు వాహనాలు సీజ్…
పోలీసులు నిందితుల నుంచి 426 కిలోల గంజాయి, స్విఫ్ట్ కారు, ఐషర్ డీసీఎం, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గంజాయి విలువ సుమారు రూ.2.28 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో దుండిగల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 931/2026, ఎన్డిపిఎస్ యాక్ట్-1985లోని 8(సి) ఆర్/డబ్ల్యూ 20(బి)(ii)(సి), 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
~ భర్తపైనా గతంలో ఎన్డిపిఎస్ కేసు…
ప్రధాన నిందితురాలిగా పేర్కొన్న సురంగిని పరిచ్చ అలియాస్ సునీత భర్త రాహుల్ కు కూడా గతంలో ఎన్డిపిఎస్ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2025లో నమోదైన ఎన్డిపిఎస్ కేసులో ప్రస్తుతం ఆయన ఖమ్మం జైలులో ఉన్నట్లు వెల్లడించారు.
గంజాయి ముఠాను పట్టుకోవడంలో సమన్వయంతో పనిచేసిన అదనపు డిసిపి ఎ. విశ్వ ప్రసాద్, దుండిగల్ ఇన్స్పెక్టర్ ఎం. బాల్ రెడ్డి, ఎస్వోటి కుత్బుల్లాపూర్ ఇన్స్పెక్టర్ కె. నర్సింహతో పాటు దుండిగల్ పోలీస్ స్టేషన్ మరియు ఎస్వోటి సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు