కుత్బుల్లాపూర్ అభివృద్ధిపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్ష

•కుత్బుల్లాపూర్ చౌరస్తాను ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్‌గా తీర్చిదిద్దాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 12: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, కుత్బుల్లాపూర్ కూడలిని ట్రాఫిక్ రహిత జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్‌తో ఆయన ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. కుత్బుల్లాపూర్ కూడలి వద్ద ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టి, రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటైన సీఎంసీ పరిధిలో విలీనమైన శివారు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలని అన్నారు. కొంపల్లి, నిజాంపేట్, దుండిగల్ సర్కిళ్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప కమిషనర్ శంకర్ సింగ్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే

• ఎం.ఎన్. రెడ్డి నగర్‌లో తాగునీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన…
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎం.ఎన్. రెడ్డి నగర్ ఫేజ్-1లో రూ.6.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన తాగునీటి సరఫరా పైప్‌లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధితోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జీడిమెట్ల డివిజన్‌లోని వివిధ బస్తీల్లో గత పన్నెండేళ్లుగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లోనూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ శివప్రసాద్, కాలనీ అధ్యక్షుడు సంపత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఇతర కాలనీ కమిటీ సభ్యులు, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

• కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెస్ట్ ఎం.ఎన్. రెడ్డి నగర్‌లో అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను ఆదేశించారు. కాలనీలో అధికారులతో కలిసి నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా స్థానికులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిలిచిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన నిర్మాణ పనులను తక్షణమే పునఃప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, సభ్యులు రాముడు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ పటేల్, రాజుతో పాటు కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More