దుండిగల్ సర్కిల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
• మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన ఉప కమిషనర్ వెంకట మణికరన్
దుండిగల్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దుండిగల్ సర్కిల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ చుట్టూ ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ సర్కిల్ ఉప కమిషనర్ వెంకట మణికరన్ పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
సంప్రదాయ పాటలు, ఆటపాటలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసి జరుపుకోవడం సంతోషకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.