క్రాష్ ల్యాండైన చిన్న విమానం… రూ.85 కోట్లు చెల్లించాలని పైలెట్ ను ఆదేశించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
గతేడాది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండైంది. అయితే ఇప్పుడా విమాన పైలెట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిమ్మదిరిగేలా జరిమానా వడ్డించింది. అసలేం జరిగిందంటే… సదరు పైలెట్ పేరు కెప్టెన్ మాజిద్ అక్తర్. గత సంవత్సరం కొవిడ్ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో కెప్టెన్ మాజిద్, తన కో పైలెట్ తో కలిసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున కరోనా శాంపిల్స్, ఔషధాలను వాయుమార్గంలో తరలించారు. ఆ విమానం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదే.
అయితే, ఓ పర్యాయం గ్యాలియర్ ఎయిర్ పోర్టులో దిగుతుండగా, రన్ వేపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను బలంగా ఢీకొంది. దాంతో విమానం ఆ కంచెకు చిక్కుకుని క్రాష్ ల్యాండైంది. ఆ సమయంలో విమానంలో పైలెట్ మాజిద్ అక్తర్, కో పైలెట్ శివ్ జైస్వాల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారి దిలీప్ ద్వివేది ఉన్నారు. వారు ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమానం మాత్రం పనికిరాకుండా పోయింది.
దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా చెల్లించాలంటూ పేర్కొంది. తమ విమానం తుక్కు కింద మారిందని, అందుకు రూ.60 కోట్లు, ఇతర కంపెనీల నుంచి విమానాలు అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ మరో రూ.25 కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేసింది.
ఈ వ్యవహారంపై పైలెట్ మాజిద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రన్ వేపై ఇనుప కంచె అవరోధం ఉన్నట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తనకు సమాచారం ఇవ్వకపోతే తాను ఏంచేయగలనని వాపోయారు. కనీసం ఆ విమాన బ్లాక్ బాక్స్ ను అందించినా, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని అంటున్నారు.
విమానాన్ని ప్రయాణాలకు అనుమతి ఇవ్వడానికి ముందు బీమా చేయించకపోతే ఆ తప్పు ఎవరిదో విచారణ జరిపించాలని పైలెట్ మాజిద్ డిమాండ్ చేస్తున్నారు. అయితే బీమా చేయించకముందే విమానాన్ని ప్రయాణాలకు ఎలా అనుమతించారన్న దానిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిమ్మనడంలేదు. కాగా, సదరు పైలెట్ 27 సంవత్సరాలుగా వైమానిక రంగంలో ఉన్నారు.
Tags: Pilot Bill, Small Plane, Gwalior, Madhya Pradesh