మాజీ మంత్రి పక్కచూపులు
ఒంగోలు, ఫిబ్రవరి 11: పాలేటి రామారావు. చీరాల మాజీ ఎమ్మెల్యే. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచారు. 1994లో కొణిజేటి రోశయ్యపై గెలుపొందటంతో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు పాలేటి. ఆ తర్వాత చీరాలను పదేళ్లపాటు శాసించారు. 2004లో తిరిగి కొణిజేటి రోశయ్యపై ఓడి 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరినా 2019 ఎన్నికల టైమ్‌కు మళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. కొద్దికాలానికే ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్‌తో కలసి వైసీపీ గూటికి చేరుకున్నారు పాలేటి. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మినహా ఎప్పుడూ ఓ స్థిరమైన ఆలోచన లేదనే విమర్శ పాలేటిపై ఉంది.పాలేటి రామారావు పొలిటికల్ కెరియర్‌ను పరిశీలిస్తే.. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్దతుగా నిలుస్తారో చెప్పడం కష్టమంటారు అనుచరులు. అప్పట్లో ఎన్టీఆర్ గాలిలో కొణిజేటి రోశయ్యపై గెలిచారన్న క్రెడిట్ తప్ప రాజకీయంగా ఆయన సాధించిందేమీ లేదని స్థానికంగా చెప్పుకొంటారు.
ఆయన ఉన్న పార్టీలో తనకు పనులు జరుగుతున్నంత వరకూ ఓకే.. లేకపోతే పెట్టే బేడా సర్దేస్తారనే విమర్శ ఉంది. ఇప్పటి వరకూ రాజకీయ మిత్రులుగా ఉన్న పాలేటి.. ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందట. ఇటీవల అనుచరులతో వరస సమావేశాలు నిర్వహిస్తోన్న పాలేటి.. తనను రాజకీయంగా పక్కన పెట్టారని.. బలరాం గెలుపుకోసం తాను ఎంతో కృషి చేసినా అన్యాయం చేస్తున్నారని వాపోయారట. ప్రస్తుతం వైసీపీలో తన మాట చెల్లుబాటు కావటం లేదని.. పనులు కాకుండా ఓ కీలక నేత అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారట పాలేటి.ఎలాగూ టీడీపీ చీరాల నియోజకవర్గం బెర్తు ఖాళీగా ఉండటంతో అక్కడ ఓ కర్చీఫ్ వేసేందుకు సిద్దమవుతున్నారనే టాక్ నడుస్తోందట. ఇప్పటి వరకూ నేతలంతా పాలేటిని వాడుకుని వదిలేశారన్న సింపతి వర్కవుటైతే ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలవాలన్న ఆశలోఉన్నారట. సరిగ్గా ఇదే సమయంలో ఆయన అనుచరుడు గవిని శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. చీరాల మాజీ ఎంపీపీ, ప్రస్తుతం ఏపీ పట్టణ మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ డైరెక్టరైన గవినిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది.
అంబేద్కర్‌ను దూషించారని ఆరోపిస్తూ వైసీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకే గవినిపై కేసు పెట్టారు. ఇదే అంశంపై జిల్లాలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో రాజకీయం హీటెక్కింది.తాజా వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన పాలేటి.. తన అనుచరుడు గవిని తరఫున క్షమాపణలు కూడా చెప్పారట. అయిప్పటికీ దళిత సంఘాలు గవినిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాలేటికి ఏమీ పాలుపోవడం లేదట. తన ఒక్కగానొక్క ప్రధాన అనుచరుడ్ని ఈ వివాదం నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదట పాలేటికి. రాజకీయంగా తిరిగి కరణం దగ్గరకో లేక ఇతర వైసీపీ నేతల వద్దకో వెళ్లి కేసు రాజీ చేయించలేకపోతున్నారట.
పాలేటి టీడీపీలోకి వెళ్తున్నారన్న ప్రచారంతో వైసీపీ నేతలు ఆయనకు సహకరించే పరిస్థితి లేదని టాక్. అటు టీడీపీ నుండి స్పష్టత లేకపోవటం.. ఆయనపై చంద్రబాబుకు సరైన నమ్మకం లేక.. విపక్ష పార్టీ నేతలు కూడా పరోక్షంగానైనా మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు.బీసీలు ఎక్కువగా ఉండే చీరాలలో తానే పెద్ద బీసీ నేతను అని చెప్పుకొంటారు పాలేటి. అయితే తమకు ఆయన చేసింది ఏమీ లేదని నిట్టూరుస్తూ బీసీ నేతలు పాలేటి వెంట నిలవడం లేదట. దీంతో మాజీ మంత్రి అవుట్ డేటెడ్ లీడర్‌గా మారిపోయారన్న అభిప్రాయం జనాల్లో ఉన్నట్టు అనుచరులే చెవులు కొరుక్కుంటున్నారట. మరి.. కేసు నుంచి అనుచరుడిని ఎలా కాపాడుకుంటారో.. రాజకీయ భవిష్యత్‌ను ఏ విధంగా చక్కదిద్దుకుంటారో చూడాలి.