వరంగల్, ఫిబ్రవరి 4:మేడారంలో అభివృద్ధి పనులు యథావిధిగా నాసిరకంగా పూర్తవుతున్నాయి. 75కోట్లతో చేపడుతున్న వివిధ రకాల పనులు కాంట్రాక్టర్ల ఇష్టాలకు అనుగుణంగా సాగుతుండటం గమనార్హం. నాణ్యత లేకుండా తీసికట్టుగా పనులు జరుగుతున్నాయని తెలిసి కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. త్వరగా పనులు చేయాలనే మంత్రుల ఆదేశాలను.. నాణ్యత లేమితో పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు అవకాశంగా మల్చుకుంటున్నారు. జంపన్నవాగులో నిర్మిస్తున్న స్నానఘట్టాలు, వేల సంఖ్యలో నిర్మిస్తున్న తాత్కాలిక మరుగుదొడ్లపై గట్టిగా కాలుమోపితే కూలిపోతున్నాయంటే ఎంత అధ్వానంగా పనులు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.జాతర అభివృద్ధి పనులు చిరకాలం నిలిచేలా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉండగా.. వారు మాత్రం పూర్తి ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారు. మహాజాతర ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జాతరకు జనం రెండు మూడు రోజులు ముందుగా రావడం మొదలైవుతుంది. అంటే ఈనెల 12 తర్వాత జనం లక్షలాది మంది అమ్మవారును దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ లోపు భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను యంత్రాంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి చూస్తుంటే కష్టమే అన్న అభిప్రాయం అధికార వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ మహాజాతరగా ప్రసిద్ధికెక్కిన మేడారం అభివృద్ధి పనులకు రూ.75కోట్లను మంజూరు చేసి పెద్ద మనసు చాటుకుంది. జాతర అభివృద్ధి పనుల నిమిత్తం ఆర్ అండ్ బీ శాఖకు రూ. 13కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు 13.50కోట్లు, ఇరిగేషన్ శాఖకు రూ.6కోట్లు, ములుగు జిల్లా పంచాయతీ శాఖకు ప్రత్యేకంగా రూ.4కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ.4కోట్లు, పోలీస్‌శాఖకు రూ.11కోట్లు, ఐటీడీఏ పీవో పర్యవేక్షణలో జరిగే పనులకు 2.50కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన ఫారెస్ట్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీతో పాటు దాదాపు 12శాఖలకు మొత్తం రూ.75కోట్లను కేటాయింపు చేసింది. అయితే జాతర అభివృద్ధి పనుల్లో ఆర్ అండ్‌బీ, ఆర్ డబ్ల్యూఎస్, ఇరిగేషన్, గిరిజన సంక్షేమం, ఐటీడీఏల ఆధ్వర్యంలో ప్రధానమైన పనులు జరుగుతున్నాయి. జాతరలో అత్యంత కీలకమైన మరుగుదొడ్ల నిర్మాణం అధ్వానంగా జరుగుతున్నాయి.నవ్విపోతారు గాని మాకేమి సిగ్గు అన్న విధంగా కాంట్రాక్టర్లు పనులు కొనసాగిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ సారి ప్రభుత్వం ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు రూ.13.50కోట్లను మంజూరు చేసింది. 6,145 మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. అయితే ఇంకా చాలా వరకు బేస్‌మెంట్ నిర్మాణ దశ దాటని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇసుకలో కాసింత సిమెంట్ కలర్ కనబడేట్లు అన్నట్లుగా నిర్మాణ పనులు చేపడుతున్నారు.
కొన్నాయితే ఇలా గట్టిగా తోస్తేనే కూలిపోతుండటం గమనార్హం. మరమ్మతుల పేరిట జరుగుతున్న వింతలు అన్నీ ఇన్నీ కావు. ఏవో కొన్నింటికే సిమెంట్ పూతలు కనిపిస్తున్నాయి.పెంపు పేరుతో జరుగుతున్న పనులు అడ్డదిడ్డంగా జరిగాయి. మరుగుదొడ్ల బేసిన్‌లలో సిమెంట్ పడటంతో వినియోగానికి వీల్లేకుండా ఉన్నాయి. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణంలో ఐఎస్ఐ బ్రాండ్ జీఏ షీట్స్‌కు బదులుగా నాసిరకమైనవి వినియోగిస్తున్నారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్ల మరమ్మతులను కాంట్రాక్టర్లు ప్రారంభించకపోవడం గమనార్హం. జంపన్నవాగులో స్నానఘట్టాల నిర్మాణం, వాటర్ ట్యాంకుల నిర్మాణంలోనూ ఇదే విధంగా జరుగుతోంది.జాతరకు ఇంకా పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. డిసెంబర్ చివరాంఖంలో పూర్తి కావాల్సిన పనులు వాయిదాలు పడుతూ.. అధికారుల గడువు పెంపులతో తేదీలు మారుతూ.. అభివృద్ధి పనుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మేడారం గ్రామానికి అనుసందానమైన రోడ్ల మరమ్మతులు, నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. జాతరలోని చెక్ డ్యాంల నిర్మాణం, స్నాన ఘట్టాల నిర్మాణం, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు ఆన్ ఆఫ్‌ల ఏర్పాటు, స్నానఘట్టాల వద్ద బట్టలు మార్చుకునే గదుల నిర్మాణం, కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లకు కంచెల ఏర్పాటు, లైటింగ్, పార్కింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల బిగింపు, తాగునీటి కేంద్రాలు వంటి అనేక పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జాతర తేదీల నాటికి కూడా పూర్తవుతాయనే నమ్మకం లేదని అధికార వర్గాల నుంచే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.