జగన్ కు రోజా స్వీట్ వార్నింగా..?
తిరుపతి, ఫిబ్రవరి 9: నగరి ఎమ్మెల్యే రోజా తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిశారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై పలు విజ్ఞప్తులు చేశారు. అదేంటి.. రోజా ఏపీకి చెందిన ఎమ్మెల్యే కదా.. మరి, తమిళనాడు సీఎంను కలిస్తే ఉపయోగం ఏముంటుంది? అనే అనుమానం రాకమానదు. ఇక్కడే ఉంది అసలు రాజకీయం అంటున్నారు. రోజా వ్యూహాత్మకంగా సీఎం స్టాలిన్‌తో భేటీ జరిపారని తెలుస్తోంది. భర్త సెల్వమణితో కలిసి సీఎం స్టాలిన్‌ను కలిశారు ఎమ్మెల్యే రోజా. ఏపీలో ఉన్న తమిళులను ఆదుకోవాలని, ఏపీలో తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు అందించాలని.. తమిళనాడులో ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలు ఏపీ తమిళులకూ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీరు తమిళ్.. నేను తమిళ్ అంటూ సోపేశారు.
పనిలో పనిగా స్టాలిన్‌కు ఆయన బొమ్మతో నేసిన ప్రత్యేకమైన శాలువాలు బహుకరించారు. ఇంతవరకూ రొటీన్ న్యూస్. ఈ భేటీ వెనుక ఉన్న ఎత్తుగడే అసలైన పొలిటికల్ న్యూస్.ప్రస్తుతం నగరిలో రోజా పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. దాదాపు అన్ని మండలాల్లో రెబెల్స్‌తో తలనొప్పులు ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామిల నుంచి ఎప్పటికప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్‌గా తన ప్రధాన ప్రత్యర్థి, తమ పార్టీకే చెందిన చక్రపాణిరెడ్డికి శ్రీశైలం బోర్డు ఛైర్మన్ పదవి కట్టబెట్టడం రోజాకు మింగుడుపడని అంశమే. జగనన్న సైతం తనకు ఇబ్బందులు కలిగించే వ్యక్తులను ఎంకరేజ్ చేస్తుండటంపై రోజా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఒక దశలో.. రోజా వైసీపీని వీడేందుకూ సిద్ధమయ్యారని ప్రచారం జరిగింది. అయితే, అటు టీడీపీలో చేరే పరిస్థితి లేదు.. వైసీపీలో కొనసాగడం కష్టంగా ఉంది.. జనసేన, బీజేపీలో లోకల్‌గా అంత ఇమేజ్ లేదు.. దీంతో ఏం చేయాలో అర్థంకాక.. తానుసైతం రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినట్టు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు వైసీపీ టికెట్ రావడం కష్టమే అంటున్నారు. ఒకవేళ టికెట్ వచ్చినా.. చుట్టూ పొంచిఉన్న రెబెల్స్‌తో ఓటమి ఖాయం. అందుకే, నగరి నియోజకవర్గంలో అధికంగా ఉండే తమిళుల ఓట్లు గంపగుత్తగా కొట్టేసేందుకు.. తనదైన స్టైల్‌లో రాజకీయం నెరిపారని అంటున్నారు.
అందులో భాగంగానే సీఎం స్టాలిన్‌తో భేటీ అయి.. తమిళులు సమస్యలపై ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. ఏపీలోని తమిళ విద్యార్థులకు అమ్మ ఒడి అమలు కావడం లేదు. ఆ విషయంపై ఎమ్మెల్యే రోజాపై స్థానిక తమిళులు గుర్రుగా ఉన్నారు. మరి, అమ్మ ఒడి కావాలని జగనన్నను అడగాలి కానీ.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి.. విద్యార్థులకు తమిళనాడు తరహాలో వెయ్యి రూపాయల సాయం ఇవ్వమని కోరడం కామెడీగా ఉందంటున్నారు. అలాగే తమిళనాడులో జనరల్ హాస్పిటల్స్ లో తమిళనాడు పౌరులకు ఉన్న సౌకర్యాలు అన్నింటిని.. ఏపీలోని తమిళులకు కల్పించాలని కోరారు. అన్నీ స్టాలినే చేస్తే.. మరి, జగనన్న ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ లోటుపాట్లను కప్పిపుచ్చుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను శరణు కోరడం రోజా రాజకీయం మినహా మరోటి కాదని విమర్శిస్తున్నారు. తన నియోజకవర్గ సమస్యలపై నేరుగా జగనన్న దగ్గరికి వెళ్లకుండా.. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కలిసి మెమోరాండం ఇచ్చి.. పరోక్షంగా సీఎం జగన్‌పై ఒత్తిడి పెంచాలనేది రోజా వ్యూహంగా కనిపిస్తోంది. పెద్దిరెడ్డిని మెప్పించడం కోసం.. నగరిలో తన వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్న జగన్‌రెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇవ్వడం కోసమే ఇలా తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసి.. ఏపీ తమిళుల సమస్యలను ప్రస్తావించారని అంటున్నారు. పిల్లిని గదిలో బంధించి భయపెడితే అది తిరగబడినట్టే.. రోజాను నగరిలో కట్టడి చేస్తున్న వైసీపీ పెద్దలపై రోజమ్మ ఇలా తిరుగుబాటు బావుటా ఎగరేశారని ప్రచారం జరుగుతోంది.