సిక్కోలు జిల్లా టీడీపీ నేతల కోల్డ్‌వార్‌

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11: అధికారం కోల్పోయినా అక్కడి నేతల్లో మార్పు రావడంలేదా? ఆధిపత్య పోరుతో పార్టీ ప్రతిష్ట మంటగలుపుతున్నారా? కీలక నేతలే సొంతగూటిలో చీలికలకు కారణమా?  పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా సొంత లాభానికే మొగ్గు చూపుతున్నారా? ఎవరా నాయకులు.. తెరవెనక వేస్తున్న ఎత్తుగడలేంటి?టీడీపీ కంచుకోట సిక్కోలు జిల్లా. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు పార్టీకి అండగా ఉండి.. మెజార్టీ స్థానాలు కట్టబెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలిలోనూ ఒక ఎంపీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచారు. ఇంకొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. పార్టీకి గట్టిపట్టున్న శ్రీకాకుళం జిల్లాపై చంద్రబాబు కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. స్థానిక నేతలకు ప్రాధాన్యం తగ్గడం లేదు. ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఇద్దరు నాయకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గత అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఇద్దరూ జిల్లాలో రాజకీయంగా బలం ఉన్న నాయకులే. అయితే కష్ట సమయంలో పార్టీని గాడిలో పెట్టాల్సిన ఈ ఇద్దరు నేతల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోందట.

అచ్చెన్న, కళావెంకట్రావుల మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ పోరాటం టీడీపీకి కూడా తలనొప్పిగా మారిందట. ఎప్పటి నుంచో ఇద్దర మధ్య ఆధిపత్యపోరు ఉన్నా.. ప్రస్తుతం అది ముదురుపాకన పడినట్టు తమ్ముళ్ల టాక్‌. జిల్లా రాజకీయాలను తన కనుసన్నల్లో నడపాలని అచ్చెన్న తెరవెనక పావులు కుదుపుతున్నారట. అవే పార్టీలో దుమారం రేపుతున్నట్టు సమాచారం. అధికారపార్టీ వర్సెస్‌ విపక్ష పార్టీగా ఉండాల్సిన రాజకీయం.. సొంతపార్టీ నేతలు ఒకరిపై ఒకరు చెక్‌ పెట్టుకునేలా ఉందట.ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నేతలు కృషి చేయాలి. బలాన్ని పెంచుకునేందుకు గట్టిగా పోరాడాలి. దూరమైన వర్గాలను కూడదీసుకోవాలి. ప్రత్యర్థి పార్టీ గట్టిగా ఉన్నప్పుడు విపక్ష పార్టీ నేతలు ఐక్యంగా పనిచేయాలి. ఇదే దిశగా కేడర్‌ ఆలోచిస్తున్నా.. పార్టీ పెద్దల్లో ఆ ఆలోచన లేదట.

అంతర్గత కుమ్ములాటలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారట. కొందరు కీలక నేతలను టార్గెట్ చేస్తూ వెనక గోతులు తవ్వుతున్నారట. ఎచ్చెర్ల, పాలకొండ, శ్రీకాకుళం, రాజాం నియెజకవర్గాలలో పార్టీ బాధ్యులుగా ఉన్నవారికి అచ్చెన్న ఎసరు పెడుతున్నట్టు కళావర్గం ఆరోపిస్తోంది. రాజాం మినహా మిగతాచోట్ల ఉన్న పార్టీ ఇంఛార్జ్‌లు కళావెంకట్రావు అనుయాయులుగా ముద్ర ఉంది.ఈ రివర్స్‌ పాలిటిక్స్ కొనసాగినంత కాలం టీడీపీ జిల్లాలో కుదటపడదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీలో అంతర్గత సమస్యలను పరిష్కరించాల్సిన అచ్చెన్నాయుడే.. జిల్లాలో సమస్యగా మారారన్నది ప్రత్యర్థి వర్గం ఆరోపణ. అచ్చెన్న అనుచరులే పలు నియోజకవర్గాల్లో గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నా ఆయన వారించడం లేదన్నది తమ్ముళ్ల మాట. మరి.. జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చంద్రబాబు చొరవ చూపిస్తారో.. ఎప్పటిలా నాన్చుతారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More