అప్పలరాజు కి ఇంటి నుంచే సెగ
శ్రీకాకుళం, ఫిబ్రవరి 17: మంత్రి పదవి వచ్చిన తర్వాత మా డాక్టర్ మారిపోయారు. నిన్న మొన్నటివరకు ఆప్యాయంగా పలకరించే ఆయన ఇప్పుడు కనిపిస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ద్వితీయ శ్రేణి నేతలపై వ్యూహాత్మక అణచివేత సాగుతోంది. ఇది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పలాస అధికార పార్టీ క్రింది స్థాయి నేతల్లో వ్యక్తమౌతున్న అభిప్రాయం. అసలు మంత్రి అప్పలరాజు పై సొంత పార్టీలో ఇంత వ్యతిరేకత వ్యక్తమవ్వటానికి కారణాలేంటి?మంత్రి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో అతికొద్ది మందికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం ఆయన సొంతమయ్యింది. సామాజిక సమీకరణాలు కలిసిరావడంతో మొదటిసారి ఎమ్మెల్యే అయిన అప్పలరాజు ఏకంగా మంత్రి అయ్యిపోయారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లటంతో ఆ స్థానంలో అప్పలరాజుకు జగన్ మంత్రిపదవి ఆఫర్ ఇచ్చారు.
జిల్లాలో ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లను ప్రక్కనపెట్టి మరీ అప్పలరాజు వైపు వైసీపీ బాస్ మొగ్గు చూపారు. తమ నాయకుడికి మంత్రి పదవి రావటంతో పలాస వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ ఆనందం కార్యకర్తలల్లో సన్నగిల్లుతోందట. అప్పలరాజుపై ప్రస్తుతం పాలసలోని ద్వితీయ శ్రేణి నేతకు రగిలిపోతున్నారు. అయిన వారికి కంచాల్లో.. కాని వారికి విస్తరిలో అన్నట్టు మంత్రిగారు వ్యవహరిస్తున్నారట. ఒక్కమాటలో చెప్పాలంటే మంత్రిగారి ఏకపక్ష నియంతృత్వ ధోరణితో క్యాడర్ విసిగిపోతున్నారట. మంత్రి అయ్యాక అప్పలరాజు తీరును గమనిస్తున్న సన్నిహితులు అస్సలు మా డాక్టర్ గారు ఈయనేనా అనుకుంటున్నారట.
మంత్రి అప్పలరాజు వ్యవహార శైలిపై ఇప్పటికే జిల్లా సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇక నియోజకవర్గంలో కూడా మూడు గ్రూపులు, నాలుగు వర్గాలుగా అసమ్మతి సాగుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ప్రక్కన పెట్టి మంత్రిగారి ఇలాకాల్లో తిరిగే నేతలకే అందలం ఎక్కిస్తున్నారనే టాక్ వైకాపా వర్గాల్లో వినిపిస్తోంది. పలాస అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న మాదిరిగా తయారయ్యింది. ఆవేదనను జిల్లా పెద్దలకు చెప్పుకుందామన్నా వినే నాధుడే కనపడటం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో అన్న టెన్షన్ పలాస వైసీపీ లో కనిపిస్తోంది.