ప్రకాశంలో ఆరెండూ టెన్షన్…
ఒంగోలు,ఫిబ్రవరి 5: అద్దంకి, చీరాల నియోజకవర్గాలు ఈసారి టీడీపీ, వైసీపీకి ప్రతిష్టాత్మకమే. చీరాలలో మరోసారి గెలవాలన్నది టీడీపీ యత్నం. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్నది వైసీపీ పట్టుదలగా ఉంది. అద్దంకిలోనూ అదే పరిస్థితి. అక్కడ తమ పార్టీ జెండా ఎగరేయాలని వైసీపీ భావిస్తుంది. అదే సమయంలో టీడీపీ పట్టు కోల్పోకూడదని ఆశిస్తుంది. అందుకే ప్రకాశం జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలు హాట్ సీట్లుగా మారిపోయాయి. ఇప్పుడు రెండు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో చేరిపోయాయి. ఈ జిల్లాలో వైసీపీ మరింత బలపడాల్సిన అవసరం ఉంది.. కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో టీడీపీ బలంగా ఉన్నట్లు కన్పిస్తుంది. ఈ జిల్లా పరిధిలోని అద్దంకి, పర్చూరు, రేపల్లె, చీరాలలో గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వేమూరు, బాపట్ల లో మాత్రమే వైసీపీ గెలిచింది. అందుకే సమీకరణాలన మార్చాలని నిర్ణయించింది. చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన కరణం బలరాం తర్వాత వైసీపీ మద్దతుదారుగా మారిపోయారు.
ఈసారి చీరాల టిక్కెట్ కరణంకు డౌటే. తిరిగి వైసీపీ ఆమంచి కృష్ణమోహన్ కే కేటాయించే అవకాశాలు చాలా వరకూ ఉన్నాయి. అందుకే చీరాలలో ఇద్దరికి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలు ఒకటయితే గెలుపు సునాయాసమని భావిస్తున్నారు. ఇక అద్దంకి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను ఓడించడం అంత సులువు కాదు. ఆయన వరస గెలుపులతో జోరు మీదున్నారు. ఈసారి కూడా గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడి నుంచి ఈసారి వైసీపీ కరణం వెంకటేష్ ను పోటీ చేయించాలని భావిస్తుంది. కరణం కుటుంబానికి అద్దంకి నియోజకవర్గంలో పట్టు ఉండటంతో ఈసారి కరణం వెంకటేష్ కు అద్దంకి సీటు దాదాపుగా వైసీపీ ఖరారు చేసినట్లే అని చెబుతున్నారు.
ఇప్పటి నుంచే… అయితే అక్కడ కమ్మ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం, గొట్టిపాటి రవికుమార్ స్ట్రాంగా ఉండటంతో కరణం బలరాం ఇటీవల సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. తాను వైసీపీలో చేరడంతో సొంత సామాజికవర్గం ఓట్లకు గండిపడకుండా ఆయన ఇప్పటి నుంచి చర్యలు ప్రారంభించారు. ఇక చీరాలలో టీడీపీ కొత్తవారికి అవకాశమివ్వనుందన్న టాక్ వినపడుతుంది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి పేరు వినపడుతుంది. మొత్తం మీద వైసీపీ, టీడీపీ లు రెండు నియోజకవర్గాలపై గట్టిగానే కన్నేశాయి.