వివేకా హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
కడప, ఫిబ్రవరి 23: వివేకా హత్యకేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి. డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో అతడు ఎవరెవరి పేర్లు బయటపెడతాడోనన్న టెన్షన్ నిందితుల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దస్తగిరి కొత్త ఆరోపణలు చేస్తున్నాడు. తనకు ప్రాణహాని ఉందంటున్నాడు దస్తగిరి. అప్రూవర్‌గా మారిన తర్వాత చాలామంది ఫోన్‌కాల్స్ చేసిన రమ్మంటున్నారని.. తమను కలవాలంటున్నారని ఆరోపించాడు. తన భార్య బిడ్డలు అనాధలు కాకూడదనే అప్రూవర్ గా మారి సీబీఐ ముందు నిజాలను చెప్పానన్నాడు దస్తగిరి. అప్రూవర్ స్టేట్ మెంట్ ఇవ్వక ముందు కొన్ని బెదిరింపులు వచ్చాయన్న దస్తగిరి.. మొదటి అప్రూవర్ స్టేట్ మెంట్ తరువాత కూడా కొంతమంది కలిశారని, ఆ విషయం కూడా సిబిఐకి చెప్పానన్నాడు. వివేకా హత్యకేసుకు సంబంధించి డీల్‌లో.. మున్నా అకౌంట్ లో వేసినవి తప్ప .. తనకు రూపాయి కూడా అందలేదన్నాడు.
మరోవైపు సీబీఐ అధికారులపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఉదయ్ కుమార్ రెడ్డి. దేవిరెడ్డి శంకర్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న ఉదయ్.. సీబీఐ ఏఎస్పీపై ఫిర్యాదు చేశాడు. కడప రిమ్స్ పీఎస్‌లో సీబీఐ ఏఎస్పీగా ఉన్న రామ్ సింగ్‌పై అనేక ఆరోపణలు చేశాడు. వివేకా హత్యకేసు విషయంలో తనను బెదిరిస్తున్నారని.. తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారంటూ రామ్‌సింగ్‌పై ఆరోపణలు చేశాడు.సీబీఐ అధికారుల వేధింపులతో సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. రామ్‌సింగ్‌పై 195-A, 323, 506, రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.