సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేష్ నెంబర్ వన్ స్థానం అనడంలో సందేహం లేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి
రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయడంలో ఆయన ముందే ఉంటున్నారు. అందుకు సర్వీస్ నిబంధనలను కూడా సడలించేందుకు వెనుకాడడం లేదు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయ (Grama Ward Sachivalayam) ఉద్యోగులలో ఎవరైనా ప్రొబేషన్ ఖరారుకు ముందే చనిపోయి ఉంటే, వారి కుటుంబీకులకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించేందుకు ఆమోద ముద్ర వేశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రొబేషన్ ఖరారుకు ముందు చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో అవకాశం ఉండదు. 2019 అక్టోబరులో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిలో దాదాపు 200 మంది చనిపోయారు. అందులో అత్యధికులు కరోనా సమయంలో మరణించారు. కరోనా సమయంలో వలంటీర్లతో పాటు సచివాలయాల ఉద్యోగుల ప్రత్యేక సేవలకు గుర్తింపుగా ప్రత్యేక పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు కూడా కారుణ్య నియామకాల్లో వీలు కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. దానికి సంబంధించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు.