భారత్‌ జోడో యాత్ర లో విషాదం

చండీగఢ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర’లో విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌధరీ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర పంజాబ్‌లోని ఫిలౌర్‌ ప్రాంతంలో కొనసాగుతోంది. శనివారం ఉదయం ఈ యాత్రలో పాల్గొని రాహుల్‌ గాంధీతో కలిసి నడిచిన జలంధర్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్ (‌Santokh Singh Chaudhary).. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను లూధియానాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎంపీ మరణవార్త తెలియగానే రాహుల్‌ గాంధీ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరారు.

సంతోఖ్‌ సింగ్‌.. 1946 జూన్‌ 18న జలంధర్‌లోని ధలివాల్‌ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

*ప్రముఖుల సంతాపం..*

ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతోఖ్‌ మృతికి సంతాపం ప్రకటించారు. పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కూడా ఎంపీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సంతోఖ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More