కొట్టేసిన చట్టం కింద కేసులు పెడుతున్న పోలీసులపై సుప్రీం ఆగ్రహం
ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ) ను కొట్టేసినా కూడా ఇంకా పోలీసులు అదే చట్టం కింద కేసులు నమోదు చేస్తుండటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఐటి చట్టంలోని సెక్షన్ 66 (ఏ)పై స్పష్టతనివ్వాలని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసిఎల్) దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నేడు కేసు విచారించిన జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ పోలీసుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2015 సంవత్సరంలో శ్రేయా సెహగల్ కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ను కొట్టేసిందని అయినా పోలీసులు కేసులు నమోదు చేయడం తీవ్ర ఆక్షేపణీయమని ఆయన అన్నారు. ఈ సెక్షన్ ను కొట్టివేసిన తర్వాత కూడా దేశంలోని చాలా రాష్ట్రాలలో వేలాది కేసులు నమోదు చేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది సంజయ్ పారిక్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఏమిటీ దారుణం!
ఐటి చట్టంలోని 66ఏ సెక్షన్ ను 2015 లోనే సుప్రీం కోర్టు రద్దు చేసినా దేశవ్యాప్తంగా పోలీసులు అదే చట్టాన్ని, చట్టంలో రద్దు చేసిన సెక్షన్ వినియోగించి కేసులు నమోదు చేయడం దారుణమని వ్యాఖ్యలు చేసింది. ఈఏడాది మార్చి వరకూ దేశవ్యాప్తంగా 745 కేసులను 66ఏను అనుసరించి పోలీసులు నమోదు చేశారని పీయుసియల్ సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ విషయాన్ని విన్న సుప్రీం కోర్టు బెంచ్ ఇది దిగ్ర్భాంతి కలిగించే అంశమని పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
గత ఆరు సంవత్సరాలుగా ఈ చట్టంలోని 66ఏ సెక్షన్ ను పోలీసులు అమలు చేసి కేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి పిటీషనర్ తెచ్చారు.
జిల్లా స్ధాయి నుంచి అన్ని స్ధాయిలలో ఈ సెక్షన్ రద్దు చేసిన విషయం ఎందుకు తెలియజేయలేదని కోర్టు ప్రశ్నించింది.